Kotamreddy Sridhar Reddy- CM Jagan: ఏపీ పాలిటిక్స్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం కాక రేపుతోంది. అధికార పార్టీలో రేగిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. నన్ను కెలికారు కాబట్టి ‘తగ్గేదెలే’ అంటూ శ్రీధర్ రెడ్డి హైకమాండ్ కు సవాల్ చేస్తున్నారు. అధికార పార్టీకి గిట్టని మీడియా వేదికగా చేసుకొని పార్టీ పెద్దలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలను సైతం వెల్లడిస్తున్నారు. ఇప్పటికే తాను వైసీపీకి దూరమైనట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేస్తానని కూడా సంకేతాలిచ్చారు. అయితే జగన్ పట్ల వీర విధేయత చూపుతూ వచ్చిన శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఇలా మారడంపై అధికార పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటని ఆరాతీస్తున్నాయి. అయితే తనకు సీఎం జగన్ తో వచ్చిన గ్యాప్ తో పాటు ఇతర అంశాలను కోటంరెడ్డే స్వయంగా నివృత్తి చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్ని అంశాలపై క్లారిటీగా మాట్లాడారు. చంద్రబాబును కలిసిన విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.

ఆ మధ్యన అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పాదయాత్ర చేరుకుంది. అమరావతి రైతులను కోటంరెడ్డి కలుసుకున్నారు. అక్కడ బస ఏర్పాట్లు బాగాలేకపోవడంతో వేరే చోట ఏర్పాటుచేస్తానని చెప్పారు. దీంతో తమ యాత్రకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేను అభినందిస్తూ జై అమరావతి నినాదం చేయాలని రైతులు కోరారు. అందుకు కోటంరెడ్డి సుతిమెత్తగా తిరస్కరించారు. కానీ హై కమాండ్ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది. తనను వివరణ కోరిందని కోటంరెడ్డి చెబుతున్నారు. అప్పటి నుంచి అనుమానాలు ప్రారంభమయ్యాయని.. తాను మాత్రం ఫోన్ ట్యాంపరింగ్ చేశారన్న కారణంతో బయటకు వచ్చినట్టు కోటంరెడ్డి వెల్లడించారు.
డిసెంబరు 25న టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారన్న వైసీపీ నేతల ఆరోపణలపై కూడా కోటంరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అక్కడికి నెలరోజుల ముందే ఒక నిర్ణయానికి వచ్చేశానని.. అటు తరువాత తాను ఎవరిని కలిస్తే ఎందుకని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తనపై ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కొడాలి నానితో తనకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారితోనే పార్టీ హైకమాండ్ తిట్టిస్తోందని..దానిని లైట్ తీసుకుంటున్నానని.. ఏ పార్టీలో పనిచేసినా నాయకత్వం సూచనలు పాటించాల్సిందేనని కూడా కోటంరెడ్డి చాలా స్పష్టతగా మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసేందుకు కోటంరెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబును కలిసి వచ్చిన తరువాత స్వరం మార్చుకున్నారని.. అక్కడ మంత్రి పదవి హామీ దక్కడంతోనే విమర్శల జోరు పెంచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే సహజంగా ఇది రుచించని వైసీపీ నాయకత్వం కోటంరెడ్డికి ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని ప్రకటించింది. భద్రతను తగ్గించింది. గన్ మెన్లను ఉపసంహరించుకుంది. అయితే ఇటువంటి సమయంలో నెల్లూరు నగర మేయర్ స్రవంతి తాను కోటంరెడ్డి వెంట నడవనున్నట్టు ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు కోటంరెడ్డి సంకేతాలు ఇచ్చారు. దీనిపై మాజీ మంత్రి సోమిరెడ్డి స్పందించారు. ఎవరికి వారు టిక్కెట్లు ప్రకటించే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పారు.