CM Jagan Visit Tirupati: ఏపీ సీఎం జగన్ పర్యటనలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే వణికిపోతున్నారు. అయితే సహజంగా సీఎం వస్తున్నారంటే జిల్లాకు వరాలు కురిపిస్తారని ప్రజలు ఆహ్వానిస్తుంటారు. కానీ గత కొద్దిరోజులుగా సీఎం జగన్ సంక్షేమ పథకాల బటన్ నొక్కేందుకే జిల్లా పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టేవారు.అయితే దీంతో పార్టీకి ఇది మైలేజ్ రావడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు విన్నవించడంతో జిల్లాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. సీఎం వస్తున్నారని తెలియగానే భయపడిపోతున్నారు. భద్రతా కారణాలను సాకుగా చూపి జగన్ పర్యటించే పట్టణాలను, నగరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. రహదారులు, వీధుల్లో బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.
తాజాగా జగన్ తిరుపతి పర్యటనలోనూ ప్రజలకు చుక్కలు కనిపించాయి. మంగళవారం సీఎం జగన్ తిరుపతిలో పర్యటించారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ షాపులను మూయించారు. ప్రస్తుతం శ్రీనివాస సేతు పనులు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో సామాన్యులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తొలుత ఎమ్మార్ పల్లి, బాలాజీ కోలనీ ఎన్టీఆర్ నగర్ కూడలిలో పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. తుడా రోడ్డులో పూర్తిగా రాకపోకలను నిషేధించారు. షాపుల ఎదుట బారికేడ్లు ఏర్పాటుచేశారు. నగరానికి అడ్డంగా వీటిని ఏర్పాటుచేయడంతో సాయంత్రం నుంచి రాత్రి వరకూ ప్రజల రాకపోకలు బందయ్యాయి. షాపుల మూతతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారులు నష్టపోయారు. అటు నగరంలో దేవీ నవరాత్రుల మండపాల వద్ద కూడా కఠిన ఆంక్షలు విధించారు. దీంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ను ఉన్నపలంగా మూసేశారు. దీంతో కూరగాయల కొనుగోలుకు లోపలికి వెళ్లిన వారు అక్కడే చిక్కిపోయారు. మూడు గంటల అనంతరం గేట్లు తీయడంతో బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి బయటపడ్డారు.
సీఎం జగన్ కు వివిధ సమస్యలపై అర్జీలు ఇస్తామన్న వారికి నిరాశే ఎదురైంది. వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉదయానికేచేరుకున్నారు. సీఎం కు వినతిపత్రాలు అందిస్తామని ప్రయత్నించారు. కానీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందించి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సీఎం జగన్ పర్యటన అంటేఅధికారులు, పోలీసులు అతి చేస్తున్నారన్న వాదన ఉంది. అయితే ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే తాము అలా చేయాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం సీఎం పర్యటన అంటేనే వణికిపోవాల్సి వస్తోంది.