https://oktelugu.com/

Mudragada Padmanabham Letter: ముద్రగడ లేఖ వెనుక జగన్

టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టారు ముద్రగడ. కాపుల్లో ఉన్న ఆకాంక్షను రగులుస్తూ సాగిన ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా కాపులు మద్దతు పలికారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 20, 2023 / 05:08 PM IST

    Mudragada Padmanabham Letter

    Follow us on

    Mudragada Padmanabham Letter: జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని బంద్ చేశారు. ఇక ఆ అవసరమే లేదు అన్నట్టు వ్యవహరించారు. ఈ నాలుగేళ్లలో అడపాదడపా సీఎం జగన్ ను పొగుడుతూ లేఖలు రాశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో స్ట్రాటజీ మార్చారు. వైసీపీకి ఆయాచితంగా లబ్ధి చేకూర్చేందుకు పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. వారాహి యాత్రలో పవన్ తనపై ఆరోపణలు చేశారని స్పందించారు. పనిలో పనిగా ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు విమర్శించావంటూ ప్రశ్నిస్తూ పవన్ కే సుదీర్ఘ లేఖ రాశారు. అయితే ఇందులో ఉన్న ప్రతి అక్షరం వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉంది.

    టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టారు ముద్రగడ. కాపుల్లో ఉన్న ఆకాంక్షను రగులుస్తూ సాగిన ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా కాపులు మద్దతు పలికారు. ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లడంలో ముద్రగడ సక్సెస్ అయ్యారు. నాటి విపక్షంగా వైసీపీ సైతం పరోక్షంగా సాయం చేయడంతో ఉద్యమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తునిలో విధ్వంసానికి దారితీసింది.దీంతో కాపులు టీడీపీకి వ్యతిరేకంగా మారిపోయారు. వైసీపీకి దగ్గరయ్యారు. ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి ఓటువేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమాన్ని బంద్ చేసి ముద్రగడ ఇంట్లో కూర్చున్నారు. ఉద్యమాన్ని శంకించారంటూ కారణం చెప్పి ఇంటికే పరిమితమయ్యారు. అనుకున్నట్టు వైసీపీ సర్కారు వచ్చింది కాబట్టే ముద్రగడ ఉద్యమం నుంచి తప్పుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.

    గత నాలుగేళ్లుగా జగన్ తీసుకున్న నిర్ణయాలను మెచ్చుకుంటూ ముద్రగడ లేఖలు రాసేవారు. ఇలా కాలం గడుపుతూ వస్తున్న ఆయనకు వైసీపీలో చేర్పించేందుకు జగన్ మొగ్గుచూపారు. కాపులు వ్యతిరేకమవుతున్న దృష్ట్యా కనీసం ముద్రగడను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల వైసీపీ కాపు అగ్రనేతలు ముద్రగడ వద్దకు వెళ్లి క్యూకట్టారు. పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ వస్తే ఎమ్మెల్యే.. ఆపై మంత్రి పదవి. కుమారుడు వస్తే ఎమ్మెల్యే పదవి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చర్చలు సైతం సానుకూలంగా జరిగినట్టు టాక్ నడిచింది. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ పై లేఖాస్త్రం అన్నట్టు తెలుస్తోంది.

    టీడీపీ, జనసేనలు కలిస్తే వైసీపీకి కష్టం. ముఖ్యంగా కాపు ఓటు బ్యాంకు పవన్ తీసుకెళుతున్నట్టు జగన్ కు స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే కాపుల్లో బలమైన నేతలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా ముద్రగడ అయితే కొంతవరకూ నష్టనివారణ సాధ్యమని..ఇంకా బీసీలతో పాటు కాపు అనుబంధ కులాలను కాపాడుకుంటే నష్టం తగ్గించవచ్చని జగన్ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా వారాహి యాత్రలో పవన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే అది ముద్రగడతోనే సాధ్యమని జగన్ ఈ లేఖను రాయించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలు మాత్రం ఏమంత లోతుగా మాత్రం కనిపించడం లేదు. కాపులకు కదిలించే అంశాలేవీ లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే లేఖ వెనుక జగన్ ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.