ముఖ్యమంత్రి జగన్ జనంలోకి వస్తున్నారు. చాలా కాలం తరువాత పర్యటనలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ కారణంగా తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచే కార్యకలాపాలు నిర్వహించిన ఆయన ప్రస్తుతం తన పంథా మార్చుకున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాదం లాంటి సంఘటనల్లో సైతం బాధితులను పరామర్శించేందుకు మాత్రమే ఆఫీసు నుంచి బయటకొచ్చారు.
ఈనెల 7,8 తేదీల్లో కడప, అనంతపురం జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. రెండు జిల్లాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు జిల్లాల పర్యటనల తర్వాత గోదావరి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా పర్యటించేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు సమాచారం.
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనను వచ్చే నెలలో ప్లాన్ చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తొందరలోనే విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో ఉత్తరాంధ్ర పర్యటనపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. ఉత్తరాంధ్ర పర్యటనలో ఏమేరకు వరాలు కురిపిస్తారోనని అందరు ఆసక్తిగా ఉన్నారు.
ఇన్నాళ్లు కరోనా వైరస్ కారణంగా జగన్ బయటకు రాలేకపోయారు. ఇప్పుడు వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో జిల్లాల పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు క్యాంపు ఆఫీసు నుంచే కరోనా వైరస్ పై జగన్ ప్రతిరోజు సమీక్షలు చేస్తూ వచ్చారు. జిల్లాల పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాలను ఓదార్చాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి జిల్లాల పర్యటనతో జగన్ ప్రజలకు ఏ మేరకు పని చేస్తారో వేచి చూడాల్సిందే.