
ప్రస్తుతం రాజకీయ పార్టీలు సోషల్ మీడియాకు ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వడం లేదు. మెయిన్ మీడియాను పక్కన పెట్టినా పర్లేదు, సోషల్ మీడియా ముఖ్యమని భావిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాకు వైసీపీ, టీడీపీ, జనసేన, సీపీఐ, సిపిఎం, ఇతర చిన్నాచితక పార్టీలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో ఎక్కువ శాతం సోషల్ మీడియాపైనే ఆధారపడింది. రానురాను సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు, ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా పోస్ట్ లు పెట్టె వారి సంఖ్య పెరిగింది. దీంతో వివాదాలు, కేసులు, అరెస్టులు వరకూ జరిగి పోతున్నాయి.
రాష్ట్రంలో 2019 కి ముందు టీడీపీ అధికారంలో ఆ పార్టీ నేతలను కించ పరిచే విధంగా పోస్టులు పెట్టారని వైసీపీ సోషల్ మీడియా విభాగంలోని రవి కిరణ్ పై, ఇతరులపై శాసన సభ కార్యదర్శి సత్యనారాయణ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. హైదరాబాద్ లోని వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్యాలయానికి వెళ్లిన పోలీసులను సోదాలు చేశారు. కడప జిల్లాలో అదే అంశంలో వైసీపీ సానుభూతి పరులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు.
ఇప్పుడు ఇదే విధానాన్ని అధికారంలోకి ఉన్న వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తుంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని సీఐడీ విభాగం ముగ్గురు వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది. వీరిలో గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ, మరో వ్యక్తి ఉన్నారు. వీరు విశాఖ ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటన, అనంతర పరిణామాలపై పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా అంశంపై నెల్లూరులో వివాదం ప్రారంభమైంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై పోస్టు పెట్టాడని వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే తెలుగు యువత నాయకుడు సత్యంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నాయకులు పోలీసులు స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో సామాన్యులపైనే పోలీసులు బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాపై కేసుల విషయంలో ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబును ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది.