
ఈ రోజు పత్రికలు, వెబ్ సైట్స్, సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసి చూసిన ఏపీ సీఎం జగన్ అఖండ మెజార్టీతో గెలిచిన రోజు అని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మే 23 ఏపీ రాజకీయాల్లోనే చారిత్రక దినం అంటూ కొనియాడుతున్నారు. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజున ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జగన్ ఏకంగా అసెంబ్లీలో 151 స్థానాలు సాధించారు. వైసీపీ విజయదుందుబి మోగించింది. జగన్ కు అపూర్వ విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. ప్రతిపక్ష టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమై కోలుకోకుండా దెబ్బతింది.
*పవన్ కల చెదిరింది కూడా ఇప్పుడే..
అయితే ఈరోజున అందరూ అధికార వైసీపీ గొప్పతనాన్ని.. జగన్ హీరోయిజాన్ని.. ప్రతిపక్ష టీడీపీ చంద్రబాబు ఓటమిని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఏపీ రాజకీయాలను ‘కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి’లాగా శాసిస్తానని అని గడిచిన ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ ను మాత్రం గుర్తు చేసుకోవడం లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎంతో ఆశతో ఏపీలో ఒంటరిగా పోటీచేశారు. ఆయన కల చెదిరింది కూడా ఈరోజే కావడం జనసేన నాయకుల్లో, అభిమానుల్లో నిరాశకు గురిచేసింది. అందుకే ఈరోజును జనసైనికులు ఎవరూ మరిచిపోని రోజుగా అభివర్ణిస్తున్నారు.
*కర్ణాటక వలే గెలుస్తానని వచ్చిన పవన్
నిజానికి పక్కరాష్ట్రం కర్ణాటకలో కేవలం 40 సీట్లు సాధించిన కుమారస్వామి ఆ రాష్ట్రానికి సీఎం అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీచేసి హంగ్ వస్తే ఏపీ సీఎం అవుదామని కలలుగన్నాడు. ఏకంగా భీమవరం, గాజువాకా రెండు నియోజకవర్గాల్లో పోటీచేశారు. ఎలాగైనా ఈసారి అసెంబ్లీలో అడుగుపెడుదామని అనుకున్నారు. కానీ ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. రెండు నియోజకవర్గాల్లో ఓడించారు. పవన్ భవిష్యత్ రాజకీయాలను చిదిమేశారు.
*రెండు చోట్ల ఓటమితో రూటు మార్చుకున్న పవన్
ప్రజలు తనను ఆదరిస్తారని.. ప్రజారాజ్యం ను మించి సీట్లు సాధించి చక్రం తిప్పుతానని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ అన్నయ్య పార్టీ కంటే మరీ తీసికట్టుగా చావుతప్పి ఒకటే సీటు గెలిచారు. అదీ పవన్ కాదు.. రాజోలులో జనసేన అభ్యర్థి గెలిచారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఇక సినిమాల్లోకి వెళ్లనని 2019 ఎన్నికల్లో ప్రకటించిన పవన్ మళ్లీ తన రూటు మార్చుకోవడం విశేషం.
*సినిమాలు వద్దని.. నేడు ముద్దని..
రాజకీయంగా ఏపీలో 2019 ఎన్నికలు జనసేన భవిష్యత్తును నిర్ణయించాయి. పవన్ లోనూ మార్పును తెచ్చాయి. ఏపీ రాజకీయ యవనికపై రాణించడం అంత ఈజీకాదని జనసేనాని పవన్ కు కూడా అర్థమైంది. అందుకే ఇక సినిమాలు వదిలేశానన్న పవన్ కళ్యాణ్ మనసు మార్చుకొని సినిమాలు చేస్తున్నారు. రాజకీయాన్ని సగం సగం చేస్తున్నారు. తత్వం బోధపడడంతో రాజకీయంతోపాటు సినిమాలు ముఖ్యమని మారిపోయారు. ఇలా పవన్ లోనూ మార్పు తెచ్చిన రోజుగా మే 23 నిలిచిపోయింది. రాజకీయాలే పరమావధి అనుకున్న పవన్ లోనూ ఈ మార్పుకు ఈ చారిత్రక రోజు కారణమైంది.
-నరేశ్ ఎన్నం