Jagan: ఏపీ సీఎం జగన్ ఓ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీఎం జగన్ సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. కొనకొండలలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే అక్కడ హెలిక్యాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో భారీగా దుమ్ముతో పాటు చీపురు గాల్లోకి లేచి పడింది. దీనిని గమనించిన పైలెట్ హెలిక్యాప్టర్ ను కాసేపు గాల్లోనే ఉంచారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ల్యాండింగ్ చేశారు.
అయితే ఈ విషయంలో పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతోనే ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ చీపురు ఎగిరి హెలిపాడ్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఎన్నికలవేళ కుట్ర కోణం ఏదైనా ఉందా అని ఆరా తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
గతంలో కూడా ఇటువంటి ఘటనలే జరిగిన సందర్భాలు ఉన్నాయి. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో పలు సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయి. తాజాగా మరోసారి హెలిప్యాడ్ కు సంబంధించి మరో ఘటన పునరావృతం కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అసలే ఎన్నికల సీజన్ కావడంతో.. లేనిపోని ప్రచారానికి కారణమవుతోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. బస్సు యాత్ర చేపట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరిట ఈ యాత్ర కొనసాగనుంది.