Tulasi Gowda : ఎన్‌సైక్లోపిడియా.. అనగానే ఒక అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించే ఒక నిఘంటువుగా పేర్కొంటారు. పుస్తకాల రూపంలో, గూగుల్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ ఓ మహిళను ఎన్‌సైక్లోపిడియాతో పోలుస్తున్నారు. అంటే ఏదో అంశంపై ఆమెకు మంచి పట్టు ఉందన్నమాట. ఇంతకీ ఆ మహిళ ఎవరు. ఎందుకు అలా పిలుస్తారో తెలుసుకుందాం.
తులసిగౌడ..
కర్ణాటక రాష్ట్రంలోని హలక్కి గిరిజన తెగకు చెందిన మహిళ తులసి గౌడ. ఈమెకు కనీసం విద్యాభ్యాసం లేదు. కానీ మొక్కలపై శాస్త్రవేత్తలకన్నా గొప్పగా చెప్పగలదు. ఏ మొక్కకు ఏం కావాలో తెలుసుకోగలదు. ఎలాంటి వాతావరణంలో ఏయే మొక్కలు పెరుగతాయో చెప్పగలదు. అందుకే తులసి గౌడను ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పిలుస్తున్నారు.
అంతటి పరిజ్ఞానం ఎక్కడిది..
ఇక తులసి గౌడకు మొక్కలపై ఇంతటి పరిజ్ఞానం ఎలా వచ్చిందంటే.. ఆమె రెండేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. దీంతో తులసిగౌడ చిన్నతనం నుంచే తల్లితో సమీపంలోని నర్సరీలో పనికి వెళ్లేది. మొక్కలతో ఆడుకునేది. మొక్కల మధ్యే పెరిగింది. 35 ఏళ్లపాటు నర్సరీలో పనిచేసింది. ఏళ్లుగా కర్ణాటక ఫారెస్టుకు సంబంధించిన నర్సరీలను చూసుకుంటోంది.
30 వేలకుపైగా మొక్కలు నాటి..
ఇక తులసిగౌడ ఇప్పటి వరకు 30 వేలకుపైగా మొక్కలు నాటింది. చిన్నప్పటి నుంచి నర్సరీలో పెరగడంతో ఆమెకు వివిధ రకాల మొక్కలు చెట్లపై పూర్తిగా అవగాహన ఉంది. అడవి గురించి, అందులోని చెట్ల గురించి ఎంతో పరిజ్ఞానం ఉండడంతో ఆమెను అడవి దేవతగా కూడా పేర్కొంటారు. మొక్కలపై తులసి గౌడకు అపారమైన అనుభవం ఉండడంతో ఒక విత్తనం మొలకెత్తడానికి ఏలాంటి వాతావరణం కావాలి, మట్టి ఎలా ఉండాలి, పోషకాలు ఎంత అందించాలి అనేవి సులభంగా అంచనా వేస్తుంది.
వరించిన పద్మ పురస్కారం..
పర్యావరణ పరిరక్షణకు, మొక్కలు, చెట్ల సంరక్షణకు తులసి గౌడ చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. 35 ఏళ్లు ఆమె మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికి 2021లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ తులసిగౌడకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు.