సీఎం జగన్ తాజాగా తిరుపతిలో పర్యటించాడు. ఈ పర్యటన నేపథ్యంలో బీజేపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం జరిగింది. అన్యమతస్థుడైన సీఎం జగన్ తిరుమల వెళితే డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. శ్రీవారిని జగన్ కుటుంబ సమేతంగా దర్శించుకునే సమయంలో డిక్లేషన్ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడాన్ని మంత్రి కోడాలి నాని తప్పుబట్టారు. ఈక్రమంలోనే బీజేపీ-వైసీపీ మధ్య ఓ రేంజులో పంచ్ డైలాగులు పేలాయి.
Also Read:వాగు ఉధృతితో నిండు గర్బిణీ అవస్థలు..
సీఎం జగన్ శుక్రవారం తిరుపతికి వెళ్లి శ్రీవారి దర్శించుకున్నారు. జగన్ ఎప్పటిలాగే డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకొని పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే జగన్ ను ప్రతిపక్షాలు మరో వివాదంలోకి లాగడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కరోనాతో మృతిచెందారు. ఆయన కిందటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు.
తిరుపతికి వెళ్లిన సీఎం జగన్ పర్యటన అనంతరం దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించలేదు. జగన్ తీరును ప్రతిపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు పేరిట యాత్రలు చేసే జగన్.. అధికారంలోకి వచ్చాక కనీసం వైసీపీకి చెందిన కుటుంబాలను కూడా పరామర్శించడం లేదని ఆరోపించారు. ఎంపీ దళితుడు కావడం వల్లే జగన్ పరామర్శించలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే జగన్ నేరుగా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లి ఆయన మామగారు(భారతి తండ్రి) గంగిరెడ్డిని పరామర్శించారు. దీంతో ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూరినట్లయింది.
తిరుపతి పర్యటనలో జగన్ వెంట ఉన్న డిప్యూటి సీఎం నారాయణ స్వామికి కనీసం కుర్చీ కూడా వేయలేదని.. దీంతో ఆయన నిల్చోని ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణ స్వామి కూడా దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే జగన్ అలా వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి.
Also Read: అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక
త్వరలోనే తిరుపతి ఉప ఎన్నిక రానుంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఆసాంతం వివాదాస్పదంగా మారడంతో వచ్చే ఎన్నికపై ఈ ప్రభావం ఉంటుందనే టాక్ విన్పిస్తోంది. సాధారణంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని.. అయితే తాజా వివాదం నేపథ్యంలో ఫలితం ఎలాగైనా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.