
వైసీపీని అధికారంలోకి తచ్చిన ప్రధాన అస్త్రాల్లో ప్రత్యేక హోదా కూడా ఒకటి. బీజేపీతో జట్టుకట్టిన చంద్రబాబు.. తాను ప్రత్యేక హోదా తెస్తానని, తేవాల్సిందేనని చెప్పారు. కానీ.. తేలేదు. పైపెచ్చు.. ప్యాకేజీకి ఓకే చెప్పి, ప్రత్యేక హోదావల్ల ఒరిగేది ఏమీ లేదన్నట్టుగా మాట్లాడారు. దీంతో.. జగన్ ఈ నినాదాన్ని అందుకున్నారు. ఆరునూరైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తే.. ప్రత్యేక హోదా తెచ్చి చూపిస్తానన్నారు. చంద్రబాబు మోసగించారని జనం ఫీలయ్యారు. జగన్ ఏదో చేస్తానంటున్నాడు కదా అని నమ్మారు.
సీన్ కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో రాష్ట్రంలో అధికారం కట్టబెట్టారు. పార్లమెంటు స్థానాల్లోనూ సైతం ఊహించని విధంగా గెలిపించారు. 25 సీట్లకు గానూ.. ఏకంగా 22 చోట్ల వీర తిలకం దిద్దారు. సరిగ్గా రెండేళ్లు గడిచాయి. ప్రత్యేక హోదా గురించి తాజాగా జగన్ చేసిన కామెంట్లు చూసి సొంత పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడగడం మినహా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ సర్కారు లేదు. లోక్ సభలో వారికి కావాల్సిన పూర్తి బలం ఉంది. దేవుడి దయంతో ఈ పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు మారుతాయనే సంపూర్ణ విశ్వాసం ఉంది. దేవుడి ఆశీస్సులతో ఎప్పుడో ఒకప్పుడు మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు జగన్.
ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అడగడానికి, పోరాటం చేయడానికి మధ్య ఉన్న అంతరం ఏంటనేది చెప్పాల్సిన పనిలేదు. హోదా విషయంలో ఈ మాత్రం అడుక్కోవడం అనే పని చంద్రబాబు కూడా చేశారు కదా? అది సాధ్యం కాదని తెలిసిన తర్వాతే.. ఆయన ప్లేటు ఫిరాయించారు. దాంతో అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. జనం చేతిలో చావుదెబ్బ తిన్నారు. మరి, ఇప్పుడు జగన్ కూడా.. ఇదేవిధంగా మాట్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. అడగడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పడమేంటని నిలదీస్తున్నారు.
ఈ మాత్రం అడుగుడు చంద్రబాబు చేయలేకనా.. జగన్ కు అధికారం కట్టబెట్టింది? 22 మంది ఎంపీలను గెలిపించింది ఇందుకేనా? అని ప్రజలతోపాటు విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అటు వైసీపీ నేతలు సైతం జగన్ కామెంట్ పై ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాఖ్యల వల్ల పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు. పరోక్షంగా ఇక హోదా రాదని చెబుతున్నారని జనం అర్థం చేసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు కేంద్రాన్ని హోదా విషయంలో కనీసం గట్టిగా ప్రశ్నించకపోగా.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మైస్ అవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.