CM Jagan: గతంలో జనం జనం అని వెంపర్లాడారు. ఇప్పుడదే జనానికి ముఖం చాటేస్తున్నారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు. పెట్టినా ఆకాశ మార్గంలో వెళ్లిపోతున్నారు. రోడ్డు మార్గం గుండా వెళుతున్నా ఏ వాహనంలో వెళ్తున్నారో తెలియనంతగా భద్రతా వలయం మధ్య పర్యటనలు సాగిస్తున్నారు. ప్రజలంటే భయమా? లేకుంటే దర్పం ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు. జగన్ ఏమంత వ్యూహకర్త కాదు. సుదీర్ఘ రాజకీయాలుచేసిన నేత కాదు. కేవలం తండ్రి మరణం నుంచి వచ్చిన సింపతితో గెలిచిన నాయకుడు మాత్రమే. ప్రజల మధ్య తిరుగుతూ నేను మీకు అండగా ఉంటా.. మీతోనే ఉంటా అని నమ్మకంగా చెప్పినందునే ప్రజలు నమ్మి ఓటేశారు. ఇప్పుడదే ప్రజలు జగన్ కు కంటగింపుగా మారారు. తండ్రి మరణం వరకూ జగన్ ఒక సాధారణ ఎంపీ. ఉమ్మడి రాష్ట్రంలో 42 మందిలో ఆయన ఒకరు తప్ప ఆయనకంటూ ప్రత్యేకత ఏమీలేదు. ఉంటే గింటే సీఎం కొడుకు… ఆపై తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారన్న గుర్తింపు తప్ప.. ఏ స్పెషలైజేషన్ ఆయన వద్ద లేదు.

వైఎస్ చనిపోయాక కాంగ్రెస్ హైకమాండ్ సీఎం జగన్ కు సీఎం పోస్టు ఇవ్వలేదు. అయితే ఇది రుచించని జగన్ అప్పటికే పార్టీ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నట్టున్నారు. అందుకే వైఎస్అకాల మరణాన్ని తట్టుకోలేక వేలాది మంది చనిపోయారంటూ..వారిని ఓదార్చేందుకు బయలుదేరారు. సహజ మరణాలను సైతం వైఎస్ కోసం చనిపోయినట్టు సాక్షిలో రాయించి మరీ పరామర్శలు చేశారు. అప్పటి నుంచి జగన్ జనయాత్రలు కొనసాగించారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. తొలి ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యేసరికి మళ్లీ పాదయాత్ర అంటూ జనం బాట పట్టారు. అప్పటి నుంచి సీఎం అయ్యేవరకూ ప్రతీరోజూ జనం మధ్యే జగన్ గడిపారు. తీరా అధికారం చేపట్టిన తరువాత తన మనసును మార్చుకున్నారు. జనం అన్న మాట వింటేనే దూరం జరిగిపోతున్నారు.
జనం అభిమానంతో అంతులేని విజయం సాధించిన తమ అధినేత జనానికి ఎందుకు దూరంగా ఉంటున్నారో అంతుపట్టక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసి.. ప్రజల మధ్య ఉన్న నేత ఇలా మారిపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎంగా పదవి చేపట్టి నాలుగేళ్లవుతున్నా ఏనాడు ప్రజలతో మమేకం కాలేకపోయారు. తొలి రెండేళ్లు కరోనాతో తాడేపల్లి నుంచి కాలు కదపలేదు. ఇప్పుడు పర్యటనలకు శ్రీకారం చుట్టినా ప్రజలకు ఆమడ దూరంలో ఉండిపోతున్నారు. వీలైతే ఆకాశ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చివరకు తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్లాలన్నా హెలికాప్టర్ లోనే వెళుతున్నారు.
సాధారణంగా సీఎంలు ప్రతీరోజూ జనాన్ని కలిసేందుకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. జగన్ మాత్రం అటువంటి సహసమేమీ చేయడం లేదు. సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కదా.. ఇక ప్రజలతో ఏం పని అనుకుంటున్నారో తెలియదు కానీ వారిని కలిసేందుకు మాత్రం ఇష్టపడడం లేదు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రజాదర్బార్అంటూ ఒక కార్యక్రమానికి ప్లాన్ చేశారు. అందుకు షెడ్యూల్ కూడా ప్రకటించారు. ప్రజలు కూడా భారీగా తరలివచ్చారు. కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అని ప్రకటించారు. అప్పటి నుంచి అదిగో దర్బార్.. ఇదిగో దర్బార్ అంటూ చెబుతున్నారే తప్ప నిర్వహించిన దాఖలాలు లేవు మరోసారి అలాంటి కార్యక్రమాన్నే నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. కానీ గత అనుభవాల దృష్ట్యా నమ్మశక్యం కావడం లేదు.

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. పోనీ అక్కడైనా జనాలను నేరుగా కలుస్తున్నారంటే అదీ లేదు. అడ్డంగా పరదాలు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దూరం నుంచే చేయి ఊపి వారిని సంతోషపెడుతున్నట్టు భావిస్తున్నారు. వందలాది మంది పోలీసు బలగాల మధ్య సీఎంను చూస్తున్న జనం నాటి జగనేనా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో జగన్ లెక్కలుండొచ్చు కానీ.. ప్రజలంటే ఆయన భయపడుతున్నారన్న సంకేతాలు మాత్రం వెలువడుతున్నాయి. అవి రోజురోజుకూ ప్రజల్లో బలపడుతున్నాయి. విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారుతున్నాయి. అయితే జగన్ వ్యవహార శైలి దర్పం అయినా అయి ఉండాలి…లేకుంటే భయమైనా అయి ఉండాలని విశ్లేషకులు భావిస్తున్నారు.