Rayalaseema Politics: సీమలో జగన్ పార్టీ నేతలు రచ్చకెక్కారు. సమన్వయ కమిటీ సమావేశాల్లో అసమ్మతి రాగం ఆలపించారు. మంత్రి పెద్దిరెడ్డి సాక్షిగా బాహాబాహికి దిగారు. చిత్తూరు నుంచి అనంతపురం వరకు, కడప నుంచి కర్నూలు వరకు సీమలో ఏ నియోజకవర్గం చూసినా అసమ్మతితో అట్టుడుకుతోంది. గూడుకట్టుకున్న అసమ్మతి ఒక్కసారిగా పెల్లుబికింది. కుర్చీలతో, చెప్పులతో పరస్పర దాడులకు తెగబడ్డారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకరనారాయణ పెద్ద ఎత్తున అసమ్మతి మూటగట్టుకున్నారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో అసమ్మతి నేతలు భగ్గుమన్నారు. చెప్పులతో దాడులు, ప్రతిదాడులకు దిగారు. హిందూపురం నియోజకవర్గంలో కూడ ఇదే పరిస్థితి. ఇటీవల హత్యకు గురైన చౌళూరు రామకృష్ణారెడ్డి వర్గం, వైకాపా ఇంచార్జీ ఇస్మాయిల్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇస్మాయిల్ కు టికెట్ ఇస్తే సహించేది లేదని పెద్దిరెడ్డి ఎదుటే తేల్చిచెప్పారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో అన్నదమ్ముల మధ్య విబేధాలు సమన్వయ కమిటీ సమావేశం వేదికగా బయటపడ్డాయి. వైకాపా ఇంచార్జీ విశ్వేశరరెడ్డి తీరు పై ఆయన తమ్ముడు మధుసూధన రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి ఇద్దరికి సర్దిచెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గం వైకాపా ఇంచార్జీ విశ్వేశ్వరరెడ్డి నాయకత్వం పై అసంతృప్తితో ఉంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పై స్థానిక వైకాపా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రికి మళ్లీ టికెట్ ఇస్తే సహకరించే పరిస్థితి ఉండదని పీకే టీం ప్రతినిధుల ఎదుట తేల్చిచెప్పినట్టు సమాచారం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మూడుముక్కలాటగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి వయోభారం రీత్యా కొడుకుని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే.. తమ కొడుకులకు టికెట్ ఇవ్వాలంటూ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి లాబీయింగ్ నడుపుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య స్థానిక నేతలు నలిగిపోతున్నారు. కర్నూలు నగరంలో ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించే పరిస్థితి లేదు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మధ్య పోరు తీవ్రమైంది. సొంతపార్టీలోనే రెండు వర్గాలుగా స్థానిక ప్రజాప్రతినిధులు చీలిపోయారు. ప్రసాద్ రెడ్డికి టికెట్ రాకుండా శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అవసరం అయితే వైఎస్ కుటుంబీకుల్ని ప్రొద్దుటూరు బరిలో దింపాలని అసమ్మతి నేతలు భావిస్తున్నారు. జమ్మలమడుగులో కూడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసి.. ఎన్నికల అనంతరం కలిసి పనిచేయమంటే ఎలా అంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైకాపాను ప్రశ్నిస్తున్నారు.
చిత్తూరు జిల్లా నగిరిలో రోజాకు అసమ్మతి సెగ తప్పేలా లేదు. స్థానిక నేతలతో రోజాకు సఖ్యత లేదన్న ప్రచారం ఉంది. ప్రతి మండలంలో ఆమెకు వ్యతిరేక వర్గం తయారైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో రోజాకు సెగ తప్పదని ప్రచారం జరుగుతోంది. వైకాపాలో అసమ్మతి నానాటికి ముదురుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ముదిరి పాకాన పడే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే సీమలో వైకాపా గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం.