Ponguleti Srinivas Reddy: కమలం వైపు వెళ్తారు అన్నారు. అమిత్ షా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకుంటారు అన్నారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తారు అన్నారు.. కానీ అవన్నీ ఊహగానాలే అని తేలిపోయింది. కొద్దిరోజులుగా ఊరిస్తూ వస్తున్న పొంగులేటి పార్టీ ప్రవేశం మీద ఒక క్లారిటీ వచ్చింది. శుక్రవారం ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి అనుచరులు మొత్తం వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాల మీద చర్చ జరిగింది. అయితే తాను భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అని పొంగులేటి తన అనుచరులను అడిగారు. అయితే మెజారిటీ కార్యకర్తలు మొత్తం కాంగ్రెస్లోనే చేరాలి అని చెప్పడంతో.. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. మీ అందరి నిర్ణయం నా నిర్ణయం అని పైకి లేచారు.
28న ముహూర్తం
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పొంగులేటి కాంగ్రెస్లో చేరడం దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఢిల్లీ హై కమాండ్ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా పొంగులేటి రాకపట్ల ఒకింత సానుకూల ధోరణితోనే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా పొంగులేటితో మంతనాలు జరుపుతున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ వైపు నడిచేలా ఆయనను ఒప్పించినట్టు తెలుస్తోంది.
మారిన నిర్ణయం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదట భారతీయ జనతా పార్టీలో చేరుతారు అని అందరూ అనుకున్నారు. ఆయన కూడా ఆ దిశగానే సంకేతాలు ఇచ్చారు. అయితే రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయిలో కార్యవర్గం లేదు. ఇక్కడ బలమైన కమ్యూనిస్టులు కూడా బలహీనంగా మారిపోయారు. ఇక భారత రాష్ట్ర సమితి లో లుకలుకలు ఉన్నాయి. ఈ క్రమంలో గత ఎన్నికలను పరిశీలిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. 2018లో రాష్ట్రం మొత్తం భారత రాష్ట్ర సమితి హవా ఉంటే.. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జోష్ కనిపించింది. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో పొంగులేటి తన నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ పెద్దలు భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేకపోవడంతో.. పొంగులేటి కాంగ్రెస్ తో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.
భట్టి పాదయాత్ర పూర్తయిన తర్వాత..
ప్రస్తుతం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చి పాదయాత్ర పూర్తి అయిన తర్వాత ఖమ్మంలో ఒక భారీ సమావేశం నిర్వహించి.. ఆ వేదికగా పొంగులేటి కాంగ్రెస్లో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొన్న హైదరాబాదులో ఆమె నిర్వహించిన సభ విజయవంతం కావడంతో.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖమ్మంలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఖర్చు మొత్తం కూడా పొంగులేటి భరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిన పక్షంలో.. ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని పొంగులేటి శపధం చేశారని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.