CJI Ramana AP Tour: రాజకీయాల్లో మేనేజ్ మెంట్ గురు ఎవరయ్యా అంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం టీడీపీ అధినేత చంద్రబాబు అని.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనపై ఒక్క కేసు కూడా నిలబడలేదంటే ఆయన ఎంత పకడ్బందీగా అడుగులు వేస్తారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబుకు చంద్రబాబే సాటి. ఎంతో మంది రాజకీయ నాయకులు చిన్న చిన్న కేసులకు శిక్షలు అనుభవిస్తున్న ఈ కాలంలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని కూడా సేఫ్ గా ఉన్న ఏకైక నేత మన చంద్రబాబే అంటారు.
ప్రభుత్వాలను ఇరుకునపెట్టడంలో.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో చంద్రబాబు కోర్టులను వాడుకున్నట్టు మరెవరిని వాడుకోరన్న పేరు సంపాదించారు. అంతలా మేనేజ్ చేస్తారు కాబట్టి చంద్రబాబుపై కేసులు నిలబడవు అంటారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కోర్టులు, న్యాయమూర్తులతో వ్యవహారశైలికి చాలా పద్ధతిగా వారి మెప్పు పొందేలా ఉంటుందన్న గుసగుసలున్నాయి.
ఇక అదంతా పక్కనపెడితే తాజాగా ఏపీలో మూడు రోజుల పాటు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అయిన తెలుగు వారు జస్టిస్ ఎన్వీ రమణ పర్యటిస్తున్నారు. తన సొంత గ్రామంలోనూ ఆయన గ్రామస్థులను కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇక సీఎం జగన్ గతంలో ఇదే ఎన్వీ రమణపై సుప్రీం చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసి వైరం పెంచుకున్నారు. ఇప్పుడు పర్యటనలో ఆయనకు మర్యాదలు చేస్తూ పాత పగలన్నీ మరిచి స్వాగత సత్కారాలు చేస్తున్నారు.
ఇక చీఫ్ జస్టిస్ గౌరవార్థం ఏపీ గవర్నర్ ఇచ్చిన విందులో సీఎం జగన్, మంత్రులు, న్యాయమూర్తులు అందరూ పాల్గొని ఏపీ ప్రతిపక్ష నేతల పాల్గొనకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సహజంగా ఇలాంటి అత్యుత్తమ వ్యక్తులు వస్తే అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలకు ఆహ్వానం పంపిస్తారు. కానీ చంద్రబాబును గవర్నర్ వదిలేశాడా? జగన్ యే రాకుండా ఆహ్వానించలేదా? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇప్పటికే చంద్రబాబుకు ఉన్న మేనేజ్ మెంట్ స్కిల్స్ తో జగన్ సర్కార్ యే ఆయనను దూరం పెట్టిందా? అన్న చర్చ సాగుతోంది.
ఏదిఏమైతేనేమీ.. చంద్రబాబు సీజేఐ గౌరవార్థం ఇచ్చిన విందుల్లో కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష నేతను ఎందుకు పిలవలేదన్నది చర్చనీయాంశమైంది. సీజేఐతో చంద్రబాబు సాన్నిహిత్యం ఉందన్న కారణంగానే ఆయనను దూరం పెట్టారన్నచర్చ సాగుతోంది. మరి దీనికి అసలు కారణమేంటన్నది ఏపీ అధికారవర్గాలే చెప్పాల్సి ఉంది.