
అమరావతి భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సర్కారు ఫిర్యాదు చేయడం.. కోర్టులు దాన్ని కొట్టేయడం తెలిసిందే. అయితే.. ఎలాగైనా ఈ విషయాన్ని రుజువు చేయాలని భావిస్తున్న ఏపీ సర్కారు.. ఇప్పుడు మరో విధంగా నరుక్కొస్తోంది. ఇందులో భాగంగా సీఐడీ అధికారులు వరుస నోటీసులు జారీచేస్తున్నారు. ఇప్పుడు ఈ నోటీసుల అంశం అమరావతిలోకలకలం రేపుతోంది. మరి, ఇంతకీ.. సీఐడీ అధికారులు ఎవరికి నోటీసులు ఇస్తున్నారు? ఏ కారణంతో ఇస్తున్నారు? అన్నది చూద్దాం.
రాజధాని అమరావతి కోసం టీడీపీ సర్కారు వేలాది ఎకరాల భూములను సేకరించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పట్టాభూములతోపాటు అసైన్డ్ భూములను కూడా సేకరించింది. అయితే.. ఈ అసైన్డ్ భూముల సేకరణ వ్యవహారంలోనే అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అసైన్డ్ భూముల విషయంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణపైనా కేసులు నమోదు చేసింది సీఐడీ. కానీ.. వాటిని నిరూపించడానికి ఇబ్బందులు పడుతోంది.
ఈ క్రమంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారి, అమ్మిన వారి వివరాలు సేకరించడం మొదలు పెట్టింది ప్రభుత్వం. నిబంధనల ప్రకారం.. అసైన్డ్ భూములను ఎవరు అమ్మినా.. కొనుగోలు చేసినా.. అది చట్ట విరుద్ధం. ఇదే పాయింట్ ఆధారంగా అసైన్డ్ భూముల వ్యవహారం తేల్చాలని సర్కారు భావిస్తోందట. ఎవరు అమ్మారు? ఎవరు కొనుగోలు చేశారనేది బయటకు తీసి, నిరూపిస్తే ఈ భూముల బాగోతం మొత్తం తేలిపోతుందని జగన్ సర్కారు భావిస్తోందట.
అమరావతి భూముల సేకరణ సమయంలోనే టీడీపీ సర్కారు జీవో నెంబర్ 41 జారీచేసింది. దీని ప్రకారం.. అసైన్డ్ భూములు ఉన్న రైతులు.. తమ అవసరాల కోసం వాటిని అమ్ముకునేందుకు వీలుంది. దీని ఆధారంగానే అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అఇయతే.. జగన్ సర్కారు వచ్చిన తర్వాత జీవో 41ని రద్దు చేస్తూ.. దాని స్థానంలో 316 జీవోను తెచ్చింది. దీని ప్రకారం.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం.
ఇప్పుడు.. ఈ జీవోను అనుసరించే సీఐడీ నోటీసులు జారీచేస్తోందని సమాచారం. అసైన్డ్ భూములు కొన్నవారికి, అమ్మిన వారికి ఈ నోటీసులు అందుతున్నాయట. గడిచిన రెండు రోజుల్లోనే 50 మందికి నోటీసులు అందించినట్టు సమాచారం. వీరందరికీ 15 రోజులు గడువు ఇచ్చి, సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీచేసినట్టుగా తెలుస్తోంది. మరి, ప్రభుత్వం ఈ విధానం ద్వారానైనా అక్రమాలను తేలుస్తుందో లేదో చూడాలి.