తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ల మధ్య నెలకొన్న జలవివాదాల నేపథ్యంలో రెండు ప్రాంతాలు నిప్పు రాజేస్తున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వివాదాలకు మార్గం సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మాట్లాడుకోవాలని సూచించడం కొసమెరుపు. మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో కేసులు పరిష్కారమయ్యాయని భావించిన చీఫ్ జస్టిస్ రమణ ఏపీ, తెలంగాణకు సూచించడంపై అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల ఓ తెలుగు జంట కేసు సుప్రీంకోర్టుకు రావడంతో చీఫ్ జస్టిస్ వారికి సైతం మధ్యే మార్గంతో మధ్యవర్తిత్వం ద్వారా కేసు పరిష్కారం చేసి తన శైలి ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, జగన్ కు ఇచ్చిన సలహాతో ఆయన తనకు కలిగిన అనుభవాలనే ఉద్దేశాలుగా చూపారు. దీనిపై తెలుగు స్టేట్లలో చర్చ జరుగుతోంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ న్యాయవ్యవస్థలో పలు హోదాల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో తనకు ఎదురైన అనుభవాలనే ఏపీ తెలంగాణకు పరిష్కార మార్గంగా సూచించారు. తెలుగు ప్రజల్లో ఒకరి వైపే ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో ఏపీతో తమ ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి రమణ కుట్ర చేసినట్లు ఆరోపించారు. దీనిపై అప్పటి చీఫ్ జస్టిస్ బాబ్డేకు లేఖ రాశారు. దానిపై విచారణ అనంతరం రమణకు క్లీన్ చిట్ ఇచ్చారు. అప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియామకం తరువాత తెలుగు స్టేట్ల పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఆయనకు ఘనమైన మర్యాదలు జరిగినా ఏపీలో మాత్రం ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ కు రమణకు పడదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన చూపిన మార్గాన్ని ఆయన అనుసరించరనే విషయం ప్రచారం సాగుతోంది. దీనికి కేసీఆర్ సైతం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పొరుగు రాష్ర్టంతో ఏదో ఒక సమస్య ఉండేలా చూసుకుని ఈ విధంగా చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జల వివాదాలను కెలికిన కేసీఆర్ మధ్యవర్తిత్వానికి చొరవ చూపే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ సమస్యకు సీజేఐ రమణ సూచించిన మధ్యవర్తిత్వం అమలు కాదనే విషయం తెలుస్తోంది. రెండు ప్రాంతాల్లో కూడా సామరస్యంగా పరిస్కారం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.