Homeఆంధ్రప్రదేశ్‌AP CID: చంద్రబాబుపై కోర్టుకు సిఐడి ఫిర్యాదు

AP CID: చంద్రబాబుపై కోర్టుకు సిఐడి ఫిర్యాదు

AP CID: చంద్రబాబు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారా? ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా కోర్టు కొన్ని షరతులను విధించింది.వీటికి అదనంగా సిఐడి మరికొన్ని కండిషన్లను కోరింది.దానిపైనే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నిన్న జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. ఉండవెల్లి లోని తన ఇంటికి వెళ్లే క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించలేదని సిఐడి తో పాటు ప్రభుత్వం భావిస్తోంది. మధ్యంతర బెయిల్ ఇస్తే ఈ ర్యాలీలు ఏమిటని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం.

చంద్రబాబుకు నిన్న మధ్యాహ్నం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ తప్పనిసరి అని చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సిఐడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయినా సరే కోర్టు మధ్యంతర బెయిల్ కి మొగ్గు చూపింది. చంద్రబాబు బెయిలు అడ్డుకోవాలని ప్రయత్నించిన సిఐడి న్యాయవాది వాదనలు నిలవలేదు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలు గుర్తు చేసినా..తమ నిర్ణయాలను ప్రభావితం చేయలేరని న్యాయమూర్తి తేల్చేశారు. దీంతో చంద్రబాబుకు బెయిల్ తప్పదని భావించిన సిఐడి తరపు న్యాయవాది బెయిల్ విషయంలో అదనంగా కొన్ని కండిషన్లు కోరారు.హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.

చంద్రబాబు అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తుతో లక్ష రూపాయల షూరిటీ సమర్పించాలని.. చంద్రబాబు తన కోరుకున్న ఆసుపత్రిలో, సొంత ఖర్చుతో చికిత్స తీసుకోవచ్చని.. వైద్య చికిత్స వివరాలను సీల్డ్ కవర్లో రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరిండెంట్కు ఇవ్వాలని.. కేసుకు సంబంధించి సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయకూడదని, బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడకూడదని షరతులు పెట్టింది. నవంబర్ 28న సాయంత్రం 5 గంటల్లోపు తనంతట తానుగా జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

అయితే బెయిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో ఏసీబీ న్యాయవాది వెనువెంటనే హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ విషయంలో అదనంగా కొన్ని కండిషన్లు పెట్టాలని కోరారు. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని.. ర్యాలీలు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదని.. మీడియాతో మాట్లాడకూడదని.. సోషల్ మీడియాలో పాల్గొనకూడదని.. వైద్య చికిత్సకే పరిమితం కావాలని.. ఈ కేసు గురించి ఆయన కానీ.. ఈ కేసుతో సంబంధం ఉన్న వారితో కలిసి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని.. ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని.. ఆయన చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఇద్దరు డిఎస్పీలను నియమించాలని పిటీషన్ లో కోరారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి అదనపు షరతులు విధించాలని సిఐడి వేసిన అనుబంధ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు సూచించారు. దీనిపై బుధవారం విచారణ జరుపుతామని చెప్పారు. దీనిని పరిష్కరించే వరకు రాజకీయపరమైన ర్యాలీలు, కేసుకు సంబంధించి మీడియా సమావేశాలు నిర్వహించవద్దని.. బహిరంగ ప్రకటనలు చేయవద్దని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. భారీ కాన్వాయ్ తో ఉండవల్లికి చేరుకున్నారు. ఇప్పుడు వీటినే పరిగణలోకి తీసుకొని సిఐడి కోర్టులో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కావడం విశేషం. మరి కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో? లేదో? చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular