Chiranjeevi And Bjp: దక్షిణాది రాజకీయాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణలో రెండు రోజులు పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం ఏపీకి రానున్నారు. కర్ణాటక లో అధికారంలో ఉన్న బీజేపీ పక్కనే ఉన్న తెలంగాణ, ఏపీల్లోనూ అధికారం దిశగా పావులు కదుపుతోంది. అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న వైసీపీ కమలానికి మద్దతుగానే ఉంది. ఏపీలో అధికారంలోకి రాకున్నా వైసీపీ మద్దతు కొనసాగే అవకాశం ఉంది. కానీ ఏపీ బీజేపీ నాయకులు మాత్రం జనసేనతో కలిసి వైసీపీని గద్దె దించుతామని ప్రకనటలను చేస్తున్నారు. దీంతో కేడర్లో కాస్త అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీలో పర్యటించడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా ఈ సభకు మెగాస్టార్ చిరు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారా..? లేక జనసేన తరుపున హాజరవుతున్నారా..? అనేది ఆసక్తిగా మారింది.

మోదీ ఏపీ పర్యటన పకడ్బందీగా సాగనుంది. ఆయన రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ లో సభ పూర్తయిన తరువాత ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీ క్యాప్టర్ లో భీమవరంలో పర్యటిస్తారు. సీఎం జగన్ గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ప్రధానితో కలిసి భీమవరం చేరుకుంటారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125 వ జయంతిని భీమవరం వేదికగా నిర్వహించనున్నారు. ఇందు కోసం భీమవరం సమీపంలో ఉన్న కాళ్ల మండలం పెద అమిరంలో 16 ఎకరాల్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రధాని ఇక్కడికి చేరుకున్న తరువాత అల్లూరి సీతారామారాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
మోదీతో పాటు పలువురు ప్రముఖులు సభకు హాజరుకానున్నారు. వీరిలో భాగంగా మెగాస్టర్ చిరంజీవి కూడా వస్తారు. చిరంజీవి సొంత జిల్లాలో మోదీ పర్యటిస్తున్న సందర్భంగా ఆయనను రావాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో ఆయన ఒప్పుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్న చిరంజీవి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోయినా ఆ పార్టీ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొనడం లేదు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారనుకున్నారు. కానీ ఇప్పుడు మోదీ సభలో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
చిరంజీవి తమ్ముడు పవన్ జనసేన తరుపున మోదీ సభలో పాల్గొంటారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ జనసేన అధినేత ఈ సభకు వస్తే ఇద్దరన్నదమ్ములు కలిసి ఒకే వేదికగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ బీజేపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. తాము బీజేపీతో కలిసి వెళ్తామని ప్రకటించారు. అయితే మోదీ సభపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ సభకు చిరంజీవి వస్తే ఆయన బీజేపీలో చేరుతారా..? లేక పవన్ పార్టీకి సపోర్టుగా ఉంటారా..? అనేది కీలక అంశంగా మారింది. గతంలో పవన్ పార్టీపై ఎలాంటి కామెంట్స్ చేయని చిరంజీవి కొన్ని సందర్భాల్లో తమ్ముడికి మా సపోర్టు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు. అంతేగానీ ఏ రాజకీయ పార్టీ తరుపున కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇప్పుడు ఏకంగా బీజేపీ సభకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ అందరూ అనుకుటున్నట్లు బీజేపీలో చిరు చేరితో ఏపీ రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది.