CM Jagan: ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం ప్రజలకు చేరువ కాకున్నా పర్వాలేదు. కానీ ప్రచారం మాత్రం అదిరిపోవాలి. ఎటు చూసినా ప్రభుత్వ ప్రకటనలే కనిపించాలి. జనం కూడా ఇంత జరుగుతోందా అనుకోవాలి. ఇప్పుడు అదే విధానాన్ని రాష్ట్రంలో టీఆర్ఎస్ అవలంబిస్తున్నది. మీడియా, సోషల్ మీడియాలో సొంత డప్పు డీజే టిల్లు స్థాయిలో కొట్టుకుంటున్నది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఆస్థాన పత్రికలు ఈ స్థాయిలోనే బాకాలు ఊదేవీ. బాజాలు మోగించేవి. ఇప్పుడు పరిస్థితి వేరు కదా! అయినప్పటికీ బాబు స్తుతి స్తోత్రాన్ని మాత్రం మరవడం లేదు. ఎంత కాదనుకున్నా కేసీఆర్ కూడా ఒకప్పటి చంద్రబాబు నాయుడి కింద పని చేసిన వాడే కాబట్టి అచ్చం ఆయన పద్ధతుల్నే అవలంబిస్తున్నారు. మీడియాను మేనేజ్ చేయడం, దారిలోకి రాకపోతే అణిచివేయడం, ప్రభుత్వ పథకాలను గొప్పగా ప్రచారం చేసుకోవడంలో గురువు చంద్రబాబు నాయుడిని కేసీఆర్ మించిపోయారు. అందుకే కదా మొన్నటికి మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు దేశంలోని అన్ని ప్రధాన పత్రికలకు జాకెట్ యాడ్లు ఇచ్చింది.

టాకిల్ చేయగలిగింది
బీజేపీ ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బలమైన సోషల్ మీడియా ఈ పార్టీకి ఉంది. ప్రతిపక్షాలు ఎంత గంగ వెర్రులు ఎత్తుతున్నా టాకిల్ చేయగలుగుతున్నది అంటే దానికి కారణం సోషల్ మీడియానే. ప్రస్తుతం హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఒకప్పటి బీజేపీ అయితే ప్రచారాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు నడుస్తున్నది మోడీ షా హవా కాబట్టి.. ప్రతీ విషయంలో ప్రచారాన్ని ఇష్టపడుతున్నది. అలాంటి బీజేపీ కి హైదరాబాద్ టీఆర్ఎస్ చుక్కలు చూపిస్తున్నది.. కమలానికి ప్రచారం చేసుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడింది. ఎంతలా అంటే కనీసం మెట్రో పిల్లర్కి ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయించలేనంత. వాస్తవానికి కేంద్రం ఎల్ అండ్ టీ కంపెనీకి భారీగానే ఆర్డర్లు ఇస్తుంది. కానీ ఎల్ అండ్ టీ కంపెనీని కూడా కేటీఆర్ అండ్ కో మేనేజ్ చేయగలిగింది అంటే వారు ఏ స్థాయిలో దూకుడుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Pawan Kalyan: తెలంగాణ, ఏపీ ఎందుకు విడిపోయిందో చెప్పిన పవన్ కళ్యాణ్
ప్రభుత్వ పథకాల ప్రచారంలో ముందంజ
కొన్ని ప్రింట్ మీడియా సంస్థలు వ్యతిరేకంగా పనిచేస్తున్నా.. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడంలో మాత్రం టీఆర్ఎస్ ముందే ఉంది. ఏకంగా “తెలంగాణ చూపిస్తున్నది దేశం అనుసరిస్తున్నది” అనే స్లొగన్స్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించి కమల నాధులను కలవరపాటుకు గురిచేసింది. మొదట్లో ఈ స్థాయిలో లేకున్నా తర్వాత టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం బాగా పుంజుకుంది. ఐటీ పట్టభద్రులను రిక్రూట్ చేసుకోవడంతో సోషల్ మీడియా వింగ్ మరింత బలంగా తయారైంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, తప్పిదాలను ప్రశ్నించే వారిని దునుమాడటం టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు పోస్టులతో పెట్టిన విద్య. ఇక ఐటీ వింగ్ లో కీలకంగా వ్యవహరిస్తున్న మన్నె కృషాంక్, పాటిమీద జగన్మోహన్రావు, సతీష్ రెడ్డి కి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టిందంటే టీఆర్ఎస్ సోషల్ మీడియాకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుందో ఇస్తుందో చేసుకోవచ్చు.
జగన్ విషయంలో వేరు
వైయస్ జగన్ కు సాక్షి పేపర్, సాక్షి టీవీ, బలమైన సోషల్ మీడియా ఉంది. ఇవి మొదటినుంచి జగన్ కు రక్షణగా ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అదే పంథాను అనుసరిస్తున్నాయి. కానీ ప్రభుత్వ పరంగా పథకాలను ప్రచారం చేయడంలో అట్టర్ ప్లాప్. ఈ విషయం జగన్ కు కూడా తెలుసు. అయినా ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఉన్న తెలుగు మీడియాలో అత్యధికంగా పై స్థాయి ఉద్యోగులు ఉన్నది కేవలం సాక్షిలోనే. కానీ జగన్కు ఏ మాత్రం ఫాయిదా ఉండదు. కానీ ఇదే టీఆర్ఎస్ విషయంలో మాత్రం పూర్తి విభిన్నం. ఇక్కడ టీఆర్ఎస్ కనుసన్నల్లో మీడియా ఉంది. ఎప్పుడైతే వరంగల్ మీటింగ్ లో పది కిలోమీటర్ల లోతున వేసి తొక్కుతా అని కేసీఆర్ అన్నాడో అప్పుడే ఇక్కడ పాతుకుపోయిన ఆంధ్రా మీడియా అలర్ట్ అయింది. పైగా ఇప్పుడు ఉన్న టాప్ చానళ్ళల్లో మై హోమ్, హెటిరో పార్థసారథి రెడ్డి పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడంటే జూపల్లి రామేశ్వరుడికి, చంద్రశేఖరుడి కి టర్మ్స్ బాగా లేవు కానీ.. ప్రగతి భవన్ పిలిస్తే మై హోముడు కచ్చితంగా వెళ్తాడు.

లొసుగులు వెతికి వ్యతిరేక ప్రచారం
జగన్ ప్రవేశపెట్టే ప్రతి పథకంలోనూ లొసుగులు వెతికే వ్యతిరేక మీడియా వాటిని టామ్ టామ్ అంటూ ప్రచారం చేస్తోంది. వీటిని తిప్పి కొట్టడంలో జగన్ సొంత మీడియా ప్రతిసారి విఫలమవుతున్నది. కాగా ఇటీవల జరిగిన ప్రతీ ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ గెలిచినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని సుస్పష్టం. ఎన్నికల్లో 2009 తరహా ఫలితాలు వైఎస్ఆర్సిపి కి రాకపోవచ్చని సాక్షాత్తూ ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఈ తరహాలోనే తెలంగాణలో టిఆర్ఎస్ కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ ముందుగానే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. వీక్ గా ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేకున్నా ఆర్బాటంగా వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తున్నారు. కానీ జగన్ విషయంలో ఇలా జరగడం లేదు. పీకే సర్వే టీం వీక్ గా ఉన్న ఎమ్మెల్యేల జాబితా జగన్కు అందించినా అక్కడ ప్రభుత్వ పరంగా ఎటువంటి పథకాలు ప్రారంభించడం లేదు. పైగా ఇటీవల ప్రకటించిన కొత్త మంత్రివర్గంలోని అమాత్యులు ఒకరిపై ఒక నోరు పారేసుకొని జనాల ముందు చులకన అవుతున్నారు. ఇది పార్టీకి అంతర్గతంగా నష్టం తెచ్చిపెడుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా జనాల్లోకి వెళ్ళకముందే అధిష్టానం కట్టడి చేసింది. ప్రతిపక్ష పార్టీలు తేరుకునే లోపే అప్రమత్తమైంది. కానీ ఇలాంటి విషయాల్లో జగన్ కు దిశా నిర్దేశం చేసే వారే ఏపీలో కరువయ్యారు. తెలంగాణ నుంచి సలహాదారులను పెట్టుకున్నా ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోతోంది.
Also Read:Telangana Bjp:బీజేపీ ఆపరేషన్ తెలంగాణ విజయవంతం అవుతుందా?
[…] […]