Ayyanna Patrudu: కింజరాపు కుటుంబం కంటే మేం ఏం తక్కువ అంటున్న అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu: గత ఐదేళ్లుగా టిడిపి వాయిస్ వినిపించడంలో అయ్యన్నపాత్రుడు ముందు వరుసలో ఉన్నారు. కేసులకు సైతం భయపడలేదు. ఆయన కుమారుడు విజయ్ సైతం చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు.

Written By: Neelambaram, Updated On : January 19, 2024 3:37 pm
Follow us on

Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అధినేత చంద్రబాబుకు ఇష్టుడైన నాయకుడు కూడా ఆయనే. అటువంటి అయ్యన్నపాత్రుడు ఇప్పుడు చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబును కలిసేందుకు, మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు టిక్కెట్ నిరాకరించడమే అందుకు కారణంగా తెలుస్తోంది.

గత ఐదేళ్లుగా టిడిపి వాయిస్ వినిపించడంలో అయ్యన్నపాత్రుడు ముందు వరుసలో ఉన్నారు. కేసులకు సైతం భయపడలేదు. ఆయన కుమారుడు విజయ్ సైతం చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఐ టీడీపీ బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు కోరుతూ వచ్చారు. దీనిపై చంద్రబాబు సానుకూలత చూపించడంతో ఎంపీగా పోటీ చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. విజయ్ కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు మునస్తాపానికి గురయ్యారు. పార్టీకి అంటీముట్టునట్టుగా వ్యవహరిస్తున్నారు.

టిడిపిలో కుటుంబానికి ఒక్క టికెట్ అన్న ఫార్ములా తెరపైకి వచ్చింది. దీనిని అనుసరించి కేవలం అయ్యన్నపాత్రుడుకు మాత్రమే నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కింజరాపు కుటుంబానికి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కింజరాపు రామ్మోహన్ నాయుడు మాదిరిగానే.. తన కుమారుడు విజయ్ కూడా మంచి వక్త అని అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కింజరాపు కుటుంబం కంటే.. తాము ఏ విషయంలో తక్కువ అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుపై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న ఆ మధ్యన రా కదలిరా సభ జరిగినా అయ్యన్నపాత్రుడు హాజరు కాలేదు. అంతకుముందే చంద్రబాబును కలవాలనుకున్నా అయ్యన్నపాత్రుడికి అపాయింట్మెంట్ లభించలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో అయ్యన్నపాత్రుడు మనస్థాపానికి గురైనట్లు సమాచారం. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి.. ఒకే పార్టీలో కొనసాగుతూ వస్తున్న తన విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరు సరికాదని అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు చంద్రబాబు, ఇటు అయ్యన్నపాత్రుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.