Chinna jeeyar Swamy : తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం తరహాలో.. తెలంగాణలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేయాలని సంకల్పించిన చిన్న జీయర్‌స్వామి ఆ కార్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పూర్తి చేయించారు. లక్ష్మీనృసింహస్వామి ఆలయం కూల్చివేత నుంచి.. వాస్తు ప్రకారం పునర్నిర్మించే వరకు అన్నీ తానై కేసీఆర్‌ను నడిపించిన చిన జీయర్‌స్వామి చివరికి ఆలయ పునఃప్రారంభం సమయంలో కేసీఆర్‌కు దూరమయ్యారు. 2022 ఫిబ్రవరిలో సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈవేడుకులకు కేసీఆర్‌తోపాటు ప్రధాని మోదీని కూడా చిన జీయర్‌స్వామి ఆహ్వానించారు. అయితే అప్పటికే మోదీతో కయ్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్ ఈ విషయమై జీయర్‌స్వామిపై కినుక వహించారు. అదేసమయంలో సమతామూర్తి క్షేత్రంలో శిలాఫలకంపై కేసీఆర్ పేరు కనిపించలేదు.
పునఃప్రారంభానికి పిలవకుండా..
సమతా మూర్తి విగ్రహావిష్కరణ వేడుకల సందర్భంగా తనకు జరిగిన అవమానానికి చినజీయర్ స్వామీజీనే కారణమని కేసీఆర్ భావించారు. దీంతో దాదాపు ఎనిమిదేళ్లు ఆయననే గురువుగా పూజించిన కేసీఆర్.. యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి చినజీయర్‌ను పిలువలేదు. ఇతర స్వామీజీలతో కార్యం పూర్తి చేశారు. దీంతో పిలవని పేరంటానికి వెళ్లడం ఎందుకని జీయర్‌స్వామి మిన్నకుండిపోయారు.
ఏడాదిన్నరగా యాదాద్రికి రాని స్వామీజీ..
ఆలయ పునఃప్రారంభ వేడుకలు చినజీయర్‌స్వామి నిర్ణయించిన ముహూర్తానికే 2022, మార్చి 21 నుంచి 28 వరకు నిర్వహించారు. ఇక యాదగిరి గుట్టకు యాదాద్రిగా నామకరణం చేసింది కూడా చినజీయర్ స్వామీజీనే. కానీ కేసీఆర్ ఆలయ పునఃప్రారంభానికి ఆహ్వానించలేదన్న కారణంగా ఏడాదిన్నరపాటు యాదాద్రిలో అడుగు పెట్టలేదు స్వామీజీ. దైవదర్శనానికి కూడా వెళ్లలేదు. అంతకముందు పనుల పర్యవేక్షణ, వాస్తుదోషాల నివారణకు పలుమార్లు యాదాద్రికి వెళ్లిన స్వామీజీ.. పునఃప్రారంభం తర్వాత యాదాద్రిలో అడుగు పెట్టలేదు.
ఎట్టకేలకు లక్ష్మీనృసింహుడి దర్శనం…
ఏడాదిన్నర కాలంగా యాదాద్రిలో అడుగు పెట్టని చిన జీయర్‌స్వామి సోమవారం యదాద్రికి వచ్చారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
అధికారుల స్వాగతం..
ఇదిలా ఉంటే.. గవర్నర్ వచ్చినా ఆహ్వానం పలకని అధికారులు తాజాగా జీయర్ స్వామికి మాత్రం ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈవో గీత, ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, పోలీసులు పూర్ణకుంభంతో ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ పరిణామాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి.
ఎన్నికల వేళ మళ్లీ..
త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేయడం కేసీఆర్ ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో మరోసారి యాగం చేయడానికి, ఎన్నికల్లో విజయం సాధించేలా చిన జీయర్ ఆశీస్సులు పొందడానికే కేసీఆర్ మళ్లీ స్వామీజీకి దగ్గరవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అధికారులు స్వామీజికి ఎదురెళ్లి సాదర స్వాగతం పలికినట్లు ప్రగతి భవన్ వర్గాలే చెబుతున్నాయి.