Chinna Jeeyar Swamy: చిన్నజీయర్ స్వామి.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో లక్షలాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అధినేతలతో మంచి సంబంధాలే కొనసాగించారు. అటువంటిది ఉన్నట్టుండీ వారితో కయ్యానికి దిగి వివాదానికి కేంద్రమవుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఆయన పరోక్షం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రహదారులపై చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారిపోయాయి. అసలు ఉభయ రాష్ట్రాల సీఎంలతో స్వామిజీకి వచ్చిన వివాదాలేమిటి? అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిన్నజీయర్ స్వామిజీ అత్యంత సన్నిహితులయ్యారు.

కేసీఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా చినజీయర్ స్వామి ముందుండి నడిపించేవారు. కేసీఆర్ చేసే యాగాలు, ప్రత్యేక పూజలను స్వామిజీయే పర్యవేక్షించేవారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తిరుపతి స్థాయిలో అభివ్రద్ధి చేయాలని కేసీఆర్ భావించారు. అప్పుడు కేసీఆర్ ను ముందుడి నడిపారు స్వామిజీ. యాదాద్రిలో ప్రతీ నిర్మాణం, ప్రతీ మార్పు వెనుక చినజీయర్ స్వామి ఉన్నారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతలా నమ్మకాన్ని దేవస్థానం నిర్మాణాన్ని స్వామిజీ భుజస్కందాలపై పెట్టారు సీఎం కేసీఆర్. అదే సమయంలో ముచ్చింతల్ లో చినజీయర్ స్వామి నిర్మించతలపెట్టిన స్వర్ణ రామానుజన్ స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ అన్నివిధాలా అండదండలు అందించారు. ఆలయ నిర్మాణానికి ఇతోధికంగా సాయం చేశారు. అందిరతో విరాళాలు ఇప్పించారు.
అక్కడి నుంచే విభేదాలు..
ముచ్చింతల్ ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో స్వామిజీ వ్యవహరించిన తీరు వారి మధ్య దూరం పెంచింది. నాడు విగ్రహ ప్రతిష్ట సమయంలో శిలాఫలకంపై సీఎం కేసీఆర్ పేరు రాయించలేదు. కేవలం ప్రధాని మోదీ ప్రాపకం కోసమే చినజీయర్ స్వామి కేసీఆర్ ను విస్మరించారని ప్రచారం సాగింది. దీనికి బలం చేకూర్చేలా అప్పట్లో స్వామిజీ మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే వివాదానికి తగ్గట్టుగానే అప్పట్లో సీఎం కేసీఆర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు హాజరుకాలేదు. టీఆర్ఎస్ శ్రేణులు సైతం కనిపించలేదు. అదే సమయంలో యాదాద్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం పిలిస్తే తాను తప్పకుండా వెళతానని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంతో విభేదాలను ప్రస్తావించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఆ గొడవ గురించి మాట్లాడలేదు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కేసీఆర్ చినజీయర్ స్వామిజీని మాత్రం ఆహ్వానించలేదు. రాజగురువు స్వామిజీతో దాదాపు తెగతెంపులు చేసుకున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు భావించారు. బీజేపీ ప్రోత్సాహంతోనే స్వామిజీ రూటు మార్చారన్న వ్యాఖ్యలు వినిపించాయి.
నాడు దగ్గరై..నేడు అనుచిత వ్యాఖ్యలు
అయితే అటు తరువాత పరిణామాలతో చినజీయర్ స్వామి ఏపీ సీఎం జగన్ కు బాగా దగ్గరయ్యారు. ముచ్చింతల్ స్వర్ణ రామానుజన్ స్వామి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలకు తానే స్వయంగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. తప్పకుండా హాజరుకావాలని విన్నవించారు. అందుకు తగ్గట్టుగానే జగన్ కార్యక్రమానికి హాజరుకాగా.. చినజీయర్ స్వామి బ్రహ్మరథం పట్టారు. అంతటితో ఆగకుండా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా జగన్ సుపరిపాలన అందిస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు.

సుదీర్ఘ కాలం పాలించాలని ఆశీర్వాదాలు సైతం అందించారు. అయితే సీన్ కట్ చేస్తే.. అది జరిగి నెలల వ్యవధిలోనే చినజీయర్ స్వామి జగన్ ప్రభుత్వ పాలనపై చేసిన వ్యంగ్యోక్తులు పెద్ద దుమారానికి దారితీశాయి. ఇటీవల రాజమండ్రిలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన స్వామి ప్రవచనలిచ్చే సమయంలో ఏపీలో రోడ్ల దుస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వేలాది మంది భక్తులనుద్దేశించి తాను ఇప్పుడే జంగరెడ్డి గూడెం నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి వచ్చానని.. గోతుల రోడ్లలో మూడు గంటలు ప్రయాణం చేసి చేరుకున్నానని చెప్పడంతో భక్తలు ఒక్కసారిగా పగలబడి నవ్వారు. అయితే నెలల వ్యవధిలో స్వామిజీ వ్యాఖ్యల్లో ఇంత మార్పు వెనుక కారణం ఏమిటై ఉంటుందా అన్న చర్చ ఏపీలో ప్రారంభమైంది. సాధారణంగా ఈ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు రుచించవు కాబట్టి వారు రుసరుసలాడుతున్నారు. ఇప్పటికే రోడ్ల దుస్థితిపై నిరసనలు చేపడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు మాత్రం స్వామిజీ వ్యాఖ్యలు అస్త్రాలుగా మారిపోయాయి. అయితే తెలుగు రాష్ట్రాల సీఎంల విషయంలో సడన్ గా స్వామిజీ రూటు మార్చడమనేది ఇప్పడు ఉభయ రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైంది. అందరూ బీజేపీ కేంద్ర పెద్దల పాత్రపై అనుమానిస్తున్నారు.
Also Read:Nikhat Zareen: ఆటతో పాటు.. హక్కుల సాధనకు.. నిలిచి గెలిచిన బాక్సర్ నిఖిత జరీన్ సక్సెస్ స్టోరీ


