Chile wildfire : దట్టంగా మంటలు. ఆవరించిన పొగలు. హెలికాప్టర్లతో నీళ్లు చల్లిస్తున్నప్పటికీ చల్లారడం లేదు. పైగా మంటలు అంతకంతకు పెరుగుతుండడంతో అడవులన్నీ మరింత మండిపోతున్నాయి. అందులో ఉన్న జంతువులు కాలిపోతున్నాయి. సమీప గ్రామాల ప్రజలు బతుకు జీవుడా అంటూ పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే 112 మంది మంటలకు ఆహుతి అయ్యారు. దట్టమైన అడవిలో 40 ప్రాంతాల్లో మంటలు రావణ కాష్టాన్ని తలపిస్తున్నాయి. ఒకవేళ ఈ మంటలు తగ్గకపోతే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పెద్ద ముప్పు పొంచి ఉన్నట్టే..
చిలీ దేశంలో ఫిబ్రవరి 4న వాల్ప రైసో ప్రాంతంలోని వినా డెర్లో అడవుల్లో మంటలు చెలరేగాయి. మంటలు అంతకంతకు పెరగడంతో సమీప గ్రామాలకు చెందిన 112 మంది చనిపోయారు. ఇప్పటికే ఈ మంటల వల్ల 64 వేల ఎకరాల్లో అడవి కాలిపోయింది. 112 మంది చనిపోయినట్టు చెబుతున్న అధికారులు ఇప్పటివరకు 32 మంది మృతదేహాలను అతి కష్టం మీద గుర్తించారు. ఈ మంటలు తాకిడికి వినా డెల్ మార్ ప్రాంతంలో 1931లో స్థాపించిన ప్రసిద్ధమైన బొటానికల్ గార్డెన్ ఆదివారం కాలిపోయింది. ఈ మంటల తాకిడికి చుట్టుపక్కల ఉన్న 1600 మంది నిరాశ్రయులయ్యారు. చిలీ ప్రాంతంలో చిలదగిన మంటలు లాటిన్ అమెరికా దేశాలను కూడా ప్రభావితం చేస్తాయని అక్కడి అధికారులు అంటున్నారు. మంటల వల్ల వ్యాపిస్తున్న వేడిగాలులు ఆ దేశాలను తాకవచ్చు అని అంటున్నారు. చిలీ తీర ప్రాంత నగరాలను పొగ చుట్టుముట్టడంతో అక్కడ అత్యవసర పరిస్థితి విధించారు. ప్రధాన ప్రాంతాల్లోని నివాసితులు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. వినా డెల్ మార్ తూర్పు అంచున ఉన్న అనేక ప్రాంతాలను మంటలు చుట్టుముట్టాయి. ఈ ప్రాంతంలో సుమారు 200 మంది వ్యక్తులు తప్పిపోయారని అధికారులు అంటున్నారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.
వాల్ పరైసో ప్రాంతంలోని వినా డెల్ మార్ లో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక సోమవారం, మంగళవారం అగ్ని ప్రమాద మృతులకు స్మృత్యర్థం సంతాప దినాలు పాటించాలని చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ ప్రకటించారు. మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంటల నేపథ్యంలో వినా డెల్ మార్, క్విల్ ప్యూ, విల్లా అలెమానా, లిమాచే పట్టణాలలో కర్ఫ్యూ విధించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి స్మృత్యర్థం ప్రార్థనలు చేయాలని పోప్ ఫ్రాన్సిస్ ట్విట్టర్ ఎక్స్ లో ప్రజలను కోరారు. కాగా గత ఏడాది ఫిబ్రవరిలో చిలీ ప్రాంతంలో ఇదే స్థాయిలో మంటలు చెలరేగాయి. సుమారు నాలుగు లక్షల హెక్టర్లకు పైగా అడవి అగ్నికి ఆహుతి అయింది. 22 మంది చనిపోయారు.