Chikoti Praveen case – TRS Leaders: ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా, ఓవర్గం మీడియా కోడై కూసినా మోదీ, షా ద్వయం ఆగడం లేదు. ఎవరినీ లెక్క చేయడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే సామెత తీరుగా ఈడీ సాఫీగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి 70ఎంఎం లో సినిమా చూపిస్తోంది. ఆ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గుర్తించి, కోట్ల కొద్ది నగదును స్వాధీనం చేసుకుంది. ఏకంగా ఆ రాష్ట్ర మంత్రిని, ఆయన సన్నిహితురాలు ఆర్పితముఖర్జీని అదుపులో తీసుకొని విచారిస్తోంది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీని, రాహుల్ గాంధీని విచారిస్తోంది. హవాలా మార్గంలో లావాదేవీలు నడిపిన చికోటి ప్రవీణ్ ను అదుపులోకి తీసుకొని ఆనుపానులు సేకరిస్తున్నది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా చికోటి ప్రవీణ్ విచారణ తర్వాత అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే ఇప్పుడు బీజేపీకి కొండంత బలాన్ని చేకూరుస్తోంది. అందుకే టీఆర్ఎస్ నేతలు చికోటి ప్రవీణ్ వ్యవహారంపై మౌనంగా ఉన్నారు.
ఇంతకీ ఏం జరిగింది
చికోటి ప్రవీణ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ తన వాహనానికి అంటించుకున్నాడు. ఈ వాహనం ద్వారానే ఎక్కడికి పడితే అక్కడికి రాకపోకలు జరిపాడు. ఎలాగూ మంత్రి స్టిక్కర్ ఉండటంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇక పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చికోటి ప్రవీణ్ ఇంట్లో జరిగిన పలు వేడుకలకు హాజరయ్యారు. ఇవే కాకుండా ఆయన ఇచ్చే ప్రైవేట్ పార్టీలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే అదునుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ ప్రవీణ్ తో సహితంగా మెలిగేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారికి పలు పనులను ప్రవీణ్ చేసి పెట్టాడని సమాచారం. ఇక రంజిత్ రెడ్డి అనే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కూడా ప్రవీణ్ కుమార్ తో పలు వ్యవహారాల్లో పాల్గొన్నాడని ఈడీ వర్గాలు అంటున్నాయి. విచారణలోనూ ప్రవీణ్ కుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడని చెబుతున్నాయి. దిశగానే ఈడీ వర్గాలు లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి. అయితే ఇందులో రాష్ట్ర పోలీసులకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు.
Also Read: KCR Declares New Pensions: 10 లక్షల పాచిక ముందస్తు కేనా
గంగుల కమలాకర్ ది మరో స్టోరీ
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శ్వేత గ్రానైట్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయన గ్రానైట్ కంపెనీలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకంగా రాళ్ళను వెలికి తీశాయని బిజెపి నాయకుడు పేరాల శేఖర్రావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కరోనా సమయంలో గ్రానైట్ రాళ్లను అక్రమంగా కాకినాడ పోర్టు మీదుగా చైనా తరలించారనే ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల వందల కోట్ల రాయాలిటీని కేంద్ర ప్రభుత్వానికి ఎగవేశారని ఆయన ఆధారాలతో సహా ఎన్జీటీకి అందజేశారు. ఈ క్రమంలో విచారణ నిర్వహించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పన్ను ఎగవేత ఆరోపణలు వాస్తవమేనని ధృవీకరించింది. ఇందులో భాగంగా తదుపరి చర్యల కోసం కేంద్ర హోంశాఖకు నివేదించింది. అయితే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేంద్ర హోంశాఖ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే ఈడీ కి సమాచారం అందించింది.
కెసిఆర్ హెచ్చరికలు
చికోటి ప్రవీణ్ వ్యవహారం, గ్రానైట్ తరలింపులో అక్రమాలు.. విషయాలన్నీ ఇంటెలిజెన్స్ పోలీసులు ద్వారా తెలుసుకున్న కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పూర్తయిన తర్వాత రంజిత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ కి ఫోన్లు చేసి, “ఈడి కాచుకొని ఉంది జాగ్రత్త అని” హెచ్చరించారు. ఇదే క్రమంలో ప్రవీణ్ తో అంట కాగిన టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వివరాలను ఆయన తెప్పించుకున్నారు. వారిపై ఒక నిఘా వేశారు. అయితే మంత్రి మల్లారెడ్డి కూడా ప్రవీణ్ తో లావాదేవీలు నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ప్రవీణ్ హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ స్థలం మల్లారెడ్డి అనుచరుల ద్వారానే కొనుగోలు చేశారని తెలుస్తోంది. మొన్నటి ప్రెస్ మీట్ లో ఈడి వస్తే ఏం చేస్తుందని ప్రశ్నించిన కేసీఆర్.. తాజాగా నిన్న ఏమాత్రం దూషణలకు తావు లేకుండా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన తమ పార్టీ ప్రజా ప్రతినిధులను హెచ్చరించారని సమాచారం. ఈ పరిణామం రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రవీణ్ అదుపులో ఉన్న నేపథ్యంలో అతడు చెప్పే వివరాల ఆధారంగా తమ తదుపరి చర్యలు ఉంటాయని ఈడీ శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే అచ్చం పశ్చిమబెంగాల్ మాదిరే కనిపిస్తోంది.
Also Read:Pawan Kalyan- Chandrababu Meets Modi: మోదీ, బాబు కలయిక.. : పవన్ అదే కోరుకున్నాడా..?