CM Jagan- CSK: ఏపీ సీఎం జగన్ కు ఎమ్మెస్ ధోని సాయం

గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్‌ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి ఆడదాం ఆంధ్రా పోటీలు ఉపయోగపడాలన్నారు జగన్‌. పోటీలకు వచ్చే క్రీడాకారులకు మంచి భోజనం, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు.

Written By: Raj Shekar, Updated On : June 23, 2023 4:07 pm

CM Jagan- CSK

Follow us on

CM Jagan- CSK: ఆంధ్రా ఆటలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేయూతనిచ్చింది. ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలపై సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థాయి రాష్ట్ర స్థాయి వరకూ పోటీల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు కూడా సీఎంకు వివరాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ఆటలను అత్యంత ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహించాలని సూచించారు. స్ఫూర్తి నింపేలా ఆటల పోటీలు సాగాలని చెప్పారు.

ప్రముఖులను భాగస్వామ్యం చేయాలని..
గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్‌ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి ఆడదాం ఆంధ్రా పోటీలు ఉపయోగపడాలన్నారు జగన్‌. పోటీలకు వచ్చే క్రీడాకారులకు మంచి భోజనం, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెంది ప్రముఖ క్రీడాకారులు అంతా ఈ పోటీల్లో భాగస్వాములయ్యేలా చూడాలని ఆదేశించారు.

ముందుకొచ్చిన చెన్నై సూపర్‌కింగ్స్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్రికెట్‌ సహా ఇతర క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని జగన్‌ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోని వైఎస్సార్‌ స్టేడియంను క్రీడలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దేందుకు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి సాయం చేయడానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలో క్రికెట్‌ అకాడమీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.

రాయుడు చొరవతోనే..
ఆంధ్రాకు చెందిన మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు.. ఇటీవల రెండుసార్లు ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. అయితే అంతా ఆయన రాజకీయాల కోసమే జగన్‌ను కలుస్తున్నారని భావించారు. వైసీపీలో చేరతారని వార్తలు కూడా వచ్చాయి. అయితే స్వామి కార్యం, స్వకార్యం దిశగా రాయుడు ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. దశాబ్దం పాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన రాయుడు ఆ జట్టు యజమాన్యం, కెప్టెన్‌తో ఉన్న చొరవతో ఆంధ్రాలో క్రీడల అభివృద్ధికి సాయం అందించేలా ఒప్పించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ధోనీ, చెన్పై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం ఆంధ్రాల్లో క్రీడల అభివృద్ధికి తమవంతు సాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్రా ఆలోచన కూడా రాయుడుదే అని తెలుస్తోంది.