
Charges On UPI Transactions: పెద్ద నోట్ల దగ్గరనుంచి నగదు వద్దు..అన్ లైన్ చెల్లింపులు ముద్దు.. అంటూ ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు సరికొత్త ఎత్తుగడకు రంగం సిద్ధం చేసింది. వ్యాపారులకు వ్యాలెట్లు, కార్డులు తదితర ప్రీపెయిడ్ సాధనాల ద్వారా చేసే యూపీఐ పే మెంట్స్ పై 1 శాతానికి పైగా ఇంటర్ చేంజ్ ఫీజులు పడబోతున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. ఇది వినియోగదారులపై ప్రభావం చూపిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో గల్లిలోని కిరాణా కొట్టు దగ్గర నుంచి.. నగరంలోని షాపింగ్ మాల్స్ దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ లైన్ లావాదేవీ లే. జేబులో చిల్లిగవ్వలేకపోయినప్పటికీ..స్మార్ట్ ఫోన్ ఉంది కదా అనే ధీమా నేడు ప్రతి ఒక్కరిది. ఈ భరోసా ఇకపై భారంగా మారనుంది. వ్యాలెట్లు లేదా కార్డుల వంటి ప్రీపెయిడ్ సాధనల ద్వారా జరిగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ పేస్ ( యూపీఐ) లావాదేవీలపై ఏప్రిల్ ఒకటి నుంచి ఇంటర్ చేంజ్ ఫీజులు వర్తించనున్నాయి.. యూపీఐ లావాదేవీలను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సర్క్యులర్ ప్రకారం 2000 ఆపై లావాదేవీలపై ఆన్లైన్ వ్యాపారులు, పెద్ద వ్యాపారులతోపాటు ఆఫ్ లైన్ లోని చిరు వ్యాపారులకు 1.1% వరకు ఈ ఇంటర్ చేంజ్ ఫీజులు పడబోతున్నాయి.

ప్రస్తుతం యుపిఐ లావాదేవీల పై ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు.. నామమాత్రపు వ్యవస్థీకృత చార్జీలు తప్ప. శనివారం నుంచి గరిష్టంగా ఒక్కో లావాదేవీపై 15 వరకు వ్యాపారులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడబోతున్నది. ఈ భారాన్ని సదరు వ్యాపారులు సహజంగానే తమ వినియోగదారులపై మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు లభిస్తున్న ప్రతీ వస్తు ఉత్పత్తి, సేవల ధర వచ్చే నెల ఒకటి తర్వాత పెరిగే వీలుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.. ప్రీపెయిడ్ సాధనాలను జారీ చేసే సంస్థలూ లావాదేవీ ప్రక్రియలో భాగంగా బ్యాంకులకు 15 బేసిస్ పాయింట్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంటుందని ఎన్పీసీఐ చెబుతోంది. దీని వల్ల కార్డు వినియోగదారులపై, ముఖ్యంగా క్రెడిట్ కార్డు యూజర్లపై హిడెన్ చార్జీలు( పరోక్ష చార్జీలు) పెరిగే వీలుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.