
Viveka Murder Case- CBI: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. హత్యచేసిన వారు కటకటాలపాలైనా.. హత్య చేయించిన వారి విషయంలో మాత్రం ఒక క్లారిటీ తేవవడంలో మాత్రం సీబీఐ ఎటువంటి పురోగతి సాధించలేకపోతోంది. ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చనడుస్తోంది. అటు విచారణ తీరుపైనా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏకంగా విచారణ అధికారినే మార్చాలని సీబీఐను ఆదేశించింది. మీరు మార్చకుంటే మేమే మార్చేందుకు ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. కేసు విషయంలో ఆది నుంచి అయోమయం కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఇద్దరు సీబీఐ ఎస్పీల పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. కేసును రెండు రకాలుగా రిజిస్టర్ చేశారు. దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి హత్యచేయడం వెనుక రాజకీయ కోణం ఉందని ఒక రిజిస్టర్ కాగా.. ఆస్తులకు సంబంధించి తలెత్తిన వివాదమే హత్యకు దారితీసిందని మరో రిజిస్టర్ లో నమోదుచేశారు. ఇప్పుడు కేసు విచారణకు మరో అధికారి రానుండడంతో ఈ రెండు రిజిస్టర్ లను క్రోడీకరించి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. అదే జరిగితే కేసు విచారణ మరింత జాప్యమయ్యే చాన్స్ కనిపిస్తొంది.
ఆది నుంచి గందరగోళం..
ఈ హత్యకేసుకు సంబంధించి సీబీఐ ఏప్రిల్ 30లోగా చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ప్రమేయంపై సీబీఐ కొన్ని అంశాలను కోర్టు ముందు ఉంచింది. దస్తగిరికి బెయిల్ రద్దు చేయాలన్న పిటీషన్ కోర్టు ముందుకు వచ్చే సమయంలో కీలక అంశాలను సీబీఐ కోర్టు పెట్టింది. . తండ్రీ కొడుకుల పాత్రపై ఆధారాలను పొందుపరచింది. అదే సమయంలో వారిద్దర్నీ సీబీఐ కేసు విచారణకు పిలిచింది. దీంతో ఇద్దరి అరెస్టులు తప్పదన్న ప్రచారం ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే వారు సీబీఐ విచారణకు హాజరుకాకపోవడం, సీబీఐ కఠిన చర్యలను నియంత్రించాలని న్యాయస్థానాల్లో పిటీషన్లు వేయడం ఒక రకమైన అయోమయం నెలకొంది. అదే సమయంలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు కీలక మలుపులు తిరిగింది. గత రెండేళ్లుగా చెప్పిందే చెప్పి.. హత్య వెనుక ఉన్న లోతైన అంశాలను విడిచిపెట్టడం పై కోర్టు సీబీఐ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది.
రెండు కోణాల్లో రిజిస్టర్..
అయితే ఈ కేసులో రెండు కోణాల్లో సీబీఐ విచారణ చేపట్టింది. దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డిలు హత్య చేయించిన వారుకాగా.. తెర వెనుక చేయించింది ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి అని సీబీఐ రిజిస్టర్ చేసింది. అదే సమయంలో ఆస్తి వివాదాలకు సంబంధించి నోటరీ ధ్రువపత్రాల కోసమే హత్య జరిగిందని మరో రిజిస్టర్ లో నమోదుచేశారు. దీంతో ఈ రెండు క్రోడీకరించి ఫైనల్ విచారణ చేపట్టాలి. ఇక్కడే తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. దీనినే సుప్రీం కోర్టు తప్పుపట్టింది. విచారణలో జాప్యాన్ని ప్రస్తావిస్తూనే.. విచారణ జరుగుతున్న తీరును ఆక్షేపించింది. వీలైనంత త్వరగా కేసును ముగించాలని స్పష్టం చేసింది. అయితే సీబీఐ గత నాలుగేళ్లుగా చేపట్టిన విచారణలో హత్యచేసిన వారినే పట్టుకుందే తప్ప.. చేయించిన వారి విషయంలో స్పష్టత ఇవ్వడంలో మాత్రం సక్సెస్ కాలేదు. అయితే దీని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయన్న టాక్ ఉంది.

కోర్టుకూ అదే అనుమానం..
హత్యకు గురైంది సాక్షాత్ మాజీ సీఎం సోదరుడు, ప్రస్తుత సీఎం బాబాయ్. పైగా మాజీ ఎంపీ, మాజీ మంత్రి కూడా. దారుణంగా హత్యకు గురైతే, చంపిన వారు నాలుగేళ్లుగా కస్టడీలోనే ఉండగా.. విచారణ మాత్రం ఎందుకు యేళ్లకు ఏళ్లు సాగుతుందో సామాన్యులకు అర్థం కాదు. యేళ్లకు యేళ్లు సాగే ఈ విచారణ ఫుల్ స్టాప్ పడే పరిస్థితులేవీ కనిపించడం లేదు. న్యాయం కోసం వివేకా కుమార్తె సునీత పోరాడుతున్నారు. తమకు సంబంధమే లేదని ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వాదిస్తున్నారు. మీడియా మాత్రం అదిగో వారి అరెస్ట్ అంటూ చూపిస్తోంది. సీబీఐ విచారణను కోర్టు తప్పుపడుతోంది. ఇన్ని ట్విస్టుల మధ్య ఇప్పట్లో కేసు కొలిక్కి వచ్చే చాన్సే లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 30లో సీబీఐ చార్జిషీట్ దాఖలుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.