Khammam NTR Statue
Khammam NTR Statue: తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహ ఏర్పాటుకు మొదటి నుంచి ప్రత్యేక చొరవ చూపిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హైకోర్టు స్టే విధించిన తరువాత తాజాగా ఆయన విగ్రహ నిర్వహణ కమిటీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఎలాంటి వివాదం లేకుండా విగ్రహ ఏర్పాటు చేయడానికి మార్గాలేమున్నాయని చర్చించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎలాగైనా ముందుకు వెళ్లాల్సిందేనని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖమ్మం లకారం చెరువులో దీనిని ఏర్పాటు చేయడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయితే ఏర్పాటు సమయానికి భారత యాదవం సంఘంతో పాటు కరాటే కళ్యాణి, తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆదరిస్తామని.. కానీ దేవుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్ లో తప్పుడు సంకేతాలు ఏర్పడుతాయని వారు కొందరు కోర్టును ఆశ్రయించగా.. ఈ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ హై కోర్టు స్టే విధించింది. అయితే తాజాగా ఈ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
విగ్రహ ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే శ్రీకృష్ణుడిలా ఉండడంపైనే తమ అభ్యంతరమని కొన్ని హిందూ సంఘాలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహంలో మార్పులు చేసిన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే ఎన్టీఆర్ విగ్రహంలో కిరీటం, పిల్లన గ్రోవి లాంటి కొన్నింటిని తీసేసిన పలు మార్పుల ద్వారా విగ్రహాన్ని నెలకొల్పాలని చూస్తున్నారు. ఇలా మార్పులు చేయడం ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ విగ్రహాన్ని నిజామాబాద్ కు చెందిన ప్రతాప వర్మ అనే శిల్పి తయారు చేశారు. 54 అడుగులు ఎత్తు ఉన్న దీనిని తయారు చేసిన తరువాత ప్రత్యేక ట్రాలీలో ఖమ్మంకు తీసుకొచ్చారు. ఖమ్మంలోని లకారం చెరవుకు ఇప్పటికే పర్యాటకుల తాకిడి ఉంది. ఈ విగ్రహ ఏర్పాటుతో మరింత ఆకర్షణంగా ఉంటుందని దీనిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే విగ్రహంలో మార్పులు చేయడం ద్వారా ఈ వివాదానికి పూర్తిగా తెరపడినట్లవుతుందా? లేదా? చూడాలి.