https://oktelugu.com/

Srikakulam Tribals : అడవిలో అన్నలతోనే స్పాట్ జస్టిస్.. అక్కడ అంతే

అన్నలను సంప్రదిస్తే చాలూ స్పాట్ జస్టిస్ తో న్యాయం జరుగుతుందని భరోసా ఉండేది. అందుకే నక్సలైట్లు అయినా.. మావోయిస్టులు అయినా.. రాడికల్స్ అన్న సిక్కోలు ప్రజలు అక్కున చేర్చుకునేవారు. విప్లవ పోరాటాలకు, అభ్యుదయ భావాలకు దగ్గరగా ఉండేవారు.  

Written By:
  • Dharma
  • , Updated On : May 20, 2023 10:31 am
    Follow us on

    Srikakulam Tribals : ఉమ్మడి ఏపీలోనూ… అవశేష ఏపీలో చిట్టచివరన ఉంటుంది శ్రీకాకుళం జిల్లా. దూరంగా విసిరేసినట్టే కాదు.. అభివృద్ధిలోనూ అత్యంత వెనుకబడి ఉంది. అయితే ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురికావొచ్చు.. కానీ చైతన్యం విషయంలో మాత్రం ఎప్పుడూ ముందంజలో సిక్కోలు ఉంది. 1960 దశకంలో నక్సలైట్ ఉద్యమానికి ఈ జిల్లా చోటు ఇచ్చింది. అనేక ప్రగతిశీల ఉద్యమాలకు పుట్టినిల్లుగానూ ఉంది. ఇక రాజకీయ చైతన్యంలోనూ ఎపుడూ ఈ జిల్లా అగ్రగామిగానే ఉంది. రాజులను తరాజులుగా చేయడంలో సిక్కోలు రూటే సేపరేటు అంటారు అంతా.

    ప్రపంచ ఉద్యమాల చరిత్రలో శ్రీకాకుళ గిరిజనోద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ‘ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ అంటూ సుబ్బరావు పాణిగ్రహి లాంటి విప్లవకారులు  పోరాటాలకు బీజం వేశారు. ఈయన కంటే ముందే గరిమెళ్ల సత్యనారాయణ లాంటి స్వాతంత్య్ర సమయోధులు శ్రీకాకుళం నేలపై సమర శంఖరావాన్ని మోగించారు. మాకొద్దు తెల్లదొరతనమూ అంటూ బ్రిటీష్ వారి ఆగడాలను ప్రతిఘటించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేట, గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం.

    రెండు దశాబ్దాల కిందట సిక్కోలు ప్రజలకు కష్టం వస్తే పాలకులకు చెప్పుకోలేదు.. అధికారులను ఆశ్రయించలేదు. వారు తలుపు తట్టేది.. వారి బాధను చెప్పేది అడివిలో అన్నలకే. కామంధుడు చెరబట్టినా..భూస్వామి ఆగడాలు పెచ్చుమీరినా.. సామాజిక రుగ్మతలు పెరిగినా.. ఎలాంటి సమస్య అయినా పరిష్కరించేది అన్నలే. చివరకు కుటుంబ సమస్యలు సైతం వారి ఎంటరైతే కానీ పరిష్కారానికి నోచుకునేవి కావు. అన్నా అని పిలిస్తే చాలు తోబుట్టువు కష్టాల్లో ఉందని భావించి వాలిపోయే వారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులతో పనిలేదు. అన్నలను సంప్రదిస్తే చాలూ స్పాట్ జస్టిస్ తో న్యాయం జరుగుతుందని భరోసా ఉండేది. అందుకే నక్సలైట్లు అయినా.. మావోయిస్టులు అయినా.. రాడికల్స్ అన్న సిక్కోలు ప్రజలు అక్కున చేర్చుకునేవారు. విప్లవ పోరాటాలకు, అభ్యుదయ భావాలకు దగ్గరగా ఉండేవారు.