Shiva Shakti Point: చంద్రయాన్_3 మిషన్ విజయవంతమైంది. ఇస్రో రూపొందించిన విక్రమ్ ల్యాండర్ దిగ్విజయంగా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగింది. ప్రపంచ దేశాలకు సాధ్యం కాని ఘనతను ఇస్రో శాస్త్రవేత్తలు సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని నేరుగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ క్రమంలో చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి పాయింట్ అని నామకరణం చేశారు. గతంలో చంద్రయాన్_2 కూలిపోయిన ప్రదేశానికి “తిరంగా పాయింట్” అని పేరు పెడుతున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇస్రో చేపట్టిన చంద్రయాన్_1 మిషన్ లో భాగంగా ల్యాండర్ చంద్రుడి మీద క్రాష్ ల్యాండ్ అయిన చోటుకు అప్పటి సర్కార్ “జవహర్ స్థల్ ” అని పేరు పెట్టింది. బిజెపి పెట్టిన పేర్లపై కాంగ్రెస్, ఇతర పక్షాలు మండిపడుతున్నాయి..”కాంగ్రెస్ పార్టీకి (గాంధీ) కుటుంబమే ప్రధానం. అందుకే చంద్రుడి మీద కూడా జవహర్ నామ జపాన్ని వదలలేదు” అంటూ బిజెపి ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ రాజకీయ సంగతి పక్కన పెడితే అసలు చంద్రుని మీద స్థలాలకు/ప్రాంతాలకు ఎవరు పేర్లు పెడతారు? ఇప్పుడు ఈ ప్రశ్న అందరి మెదళ్ళను తొలుస్తోంది.
వాస్తవానికి ఇలాంటి ప్రదేశాలకు ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ (ఐఏయూ) .. అంతర్జాతీయ ఒప్పందల ప్రకారం పేరు పెడుతుంది. చంద్రుడు లేదా అంతరిక్షంలోని ఈ గ్రహమూ, ఉపగ్రహమూ ఏ దేశానికీ సొంతం కాదు. అన్ని దేశాలకూ ఆయా గ్రహాలు, ఉపగ్రహాల మీద పరిశోధనలు చేసే అవకాశం ఉంది. అయితే ఆ ప్రాంతాలకు అవి తమకు నచ్చిన పేర్లు పెట్టుకుంటే.. ఆ పేర్లు మరొక దేశానికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. అందుకే ఈ విషయంలో ఒక పద్ధతిని పాటించడానికి 1919 లో ఐఏయూ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భారత్ తో సహా 92 సభ్య దేశాలు ఉన్నాయి.
దానికంటే ముందు..
ఐఏయూ ఒక వందల క్రితం ఏర్పాటు చేసుకున్న సంస్థ. విశ్వాంతరాళాలను దుర్భిణి వేసి మరీ గాలించిన మహనీయుడు గెలీలియో 1610 లోనే చంద్రుడిపై పర్వతాలు, బిలాలు గుర్తించాడు. కానీ ఆయన వాటికి పేర్లు పెట్టలేదు. 16 47 లో మైకేల్ వాన్ లాంగ్రెన్ అనే శాస్త్రవేత్త చందమామ తొలి మ్యాపును రూపొందించాడు. చంద్రుడిపై బిలాలకు ఆయన ఆనాడు పెట్టిన పేర్లలో మూడు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చందమామపై సముద్రాలు లేకున్నా.. చంద్రుడి పై ఉండే పలు ప్రాంతాలను సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, సీ ఆఫ్ క్లౌడ్స్, తదితర పేర్లతో పిలుస్తున్నాం కదా. దానికి కారణం ఆయనే. అయితే 1651లో గ్రీమాల్డి, రిక్కీ యోలి అనే ఇద్దరు ఆస్ట్రానమర్లు వేసిన పునాదుల మీదే ఇప్పుడు గ్రహాలకు పేర్లు పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. చంద్రుడిపై 210 బిలాలకు రిక్కీ యోని పెట్టిన పేర్లనే ఇప్పటికీ వాడుతున్నాం. ఖగోళ వస్తువులకు సంబంధించి నామకరణం చేసేందుకు సంబంధించి ఐ ఏ యూ కొన్ని సూచనలు చేసింది. వాటిలో ప్రధానమైనది.. పెట్టే పేరు చాలా సులభంగా, స్పష్టంగా, ఎలాంటి గందరగోళానికి తావు ఇచ్చే విధంగా ఉండకూడదు. ఇప్పటికే ఉన్న పేర్లను పెట్టకూడదు. ఖగోళ శాస్త్రానికి సేవలు అందించిన శాస్త్రజ్ఞులు, అన్వేషకుల ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయ, సైనిక, మత ప్రాముఖ్యం ఉన్న వారి పేర్లను అసలు పెట్టకూడదు.
ఐ ఏ యూ ఆమోదం ఇలా ఉంటుంది
ఐ ఏ యూ వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఏదైనా గ్రహం, ఉపగ్రహం పై ప్రాంతాలకు పేర్లు పెట్టే ప్రక్రియలో ఐ ఏ యూ లోని వర్కింగ్ గ్రూపులు కీలక పాత్ర పోషిస్తాయి. ఏదైనా గ్రహం లేదా ఉపగ్రహానికి సంబంధించిన పేర్లపై ప్రతిపాదనలను తొలుత టాస్క్ గ్రూపులు పరిశీలిస్తాయి. వచ్చిన పేర్లన్నింటినీ పరిశీలించిన టాస్క్ గ్రూప్ చైర్పర్సన్ తమ నిర్ణయాన్ని వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానెట్రీ సిస్టం నో మెన్ క్లేచర్(గ్రహ వ్యవస్థలకు నామకరణం చేసే కార్యనిర్వాహక బృందం_ డబ్ల్యూ జీ పీ ఎస్ ఎన్)కు సిఫారసు చేస్తారు. ఆ బృందంలోని సభ్యులు వాటిని పరిశీలించి ఎక్కువ ఓట్లు వచ్చిన పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వెంటనే ఆ పేరును “గెజిటీర్ ఆఫ్ ప్లానిటరీ నో మెన్ క్లేచర్” లో చేర్చుతారు. ఆ వెబ్ సైట్ లో పబ్లిష్ చేస్తారు. ఆ పేరుపై సభ్య దేశాలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే మూడు నెలల్లోగా ఆ అభ్యంతరాలను ఐ ఏ యూ సెక్రటరీకి తెలియజేయాల్సి ఉంటుంది. వాటిని ఐ ఏ యూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.
అప్పుడేం జరిగిందంటే
సౌర వ్యవస్థలో గురు గ్రహానికి, శని గ్రహానికి ఉన్న ఉపగ్రహాలకు గ్రీకు_రోమన్ పురాణాల్లోని దేవుళ్ళ పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఆకాశదేవుడిగా, మెరుపుల దేవుడిగా గ్రీకులు ఆరాధించే జియస్ కు ఇష్టులు, సన్నిహితుల పేర్లను వాటికి పెట్టారు. “మేక్ మేక్” అనే డ్వార్ఫ్ ప్లానెట్ కు ఈస్టర్ దీపానికి చెందిన రాపా నుయి పురాణాల్లో సృష్టికర్తగా పేర్కొన్న మేక్ మేక్ అనే దేవుడి పేరుని ఐఏయూ పెట్టింది. 2008లో చంద్రయాన్_1 సఫలమై నవంబర్ 14న ల్యాండర్ చంద్రుడిపై నిర్దేశిత స్థలంలో క్యాష్ ల్యాండ్ అయింది. మన దేశం చంద్రుడిని అందుకోగలిగిందన్న దానికి గుర్తుగా ఆ స్థలానికి నెహ్రూ పేరు పెడదామని.. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రతిపాదించినట్టు అప్పటి ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ ఇంటర్వ్యూలో ప్రకటించారు. దేశంలో సాంకేతిక, శాస్త్రీయ అభివృద్ధికి దారులు వేసిన జవహర్లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14న ల్యాండ్ క్రాస్ ల్యాండ్ అయింది. కాబట్టి నెహ్రూ పేరు పెడితే బాగుంటుంది అని ఉద్దేశపూర్వకంగా చెప్పారని మాధవన్ నాయర్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఇక ఇస్రో మూల స్తంభం, భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా భావించే విక్రం సారాభాయ్ జ్ఞాపకార్థం చంద్రుడిపై ఒక బిలానికి ఆయన పేరు పెట్టిన విషయం చాలామంది భారతీయులకు తెలియదు. చందమామ ఈశాన్య భాగంలో “మేర్ సెరె ని టాటిస్” ప్రాంతంలో ఉండే గుండ్రటి బిలానికి గతంలో “బెసెల్ ఏ” అనే పేరు ఉండేది. 1973లో ఐఏయూ దానికి సారాభాయ్ బిలం గా నామకరణం చేసింది. దీని వ్యాసం 8 కిలోమీటర్లు, లోతు 1.7 కి.మీ. ఈ సారాభాయ్ బిలానికి కేవలం 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోనే 1972లో అపోలో 17 వ్యోమ నౌక, 1973లో లూనా 21 మిషన్లు ల్యాండ్ అయ్యాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Chandrayaan 3 landing site called shiva shakti point how are the points on the moon named
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com