Ganta Srinivasa Rao: తెలుగుదేశం ( Telugu Desam)పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలు ఉన్నారు. అయితే అటువంటి వారిలో చాలామంది క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తమ వారసులకు అవకాశాలు ఇచ్చారు. ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకుని గెలిపించుకోగలిగారు. అశోక్ గజపతి రోజు తో పాటు యనమల రామకృష్ణుడు లాంటి నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తెచ్చి సక్సెస్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు లాంటి నేతలు సైతం తమ వారసులను పోటీ చేయించి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. అయితే ఆ జాబితాలోకి వచ్చారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. వచ్చే ఎన్నికల నాటికి క్రియాశీలక రాజకీయాల నుంచి గంటా తప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో సైతం ఇదే తరహా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తన బదులు కుమారుడు గంటా రవితేజ పోటీ చేస్తారని గంటా శ్రీనివాసరావు సన్నిహితుల వద్ద తన మనసులో ఉన్న మాటను వ్యక్తం చేశారట. ఇప్పటికే అధినేత చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
డబుల్ హ్యాట్రిక్ విజయంతో..
ప్రకాశం జిల్లా( Prakasam district) నుంచి వ్యాపారరీత్యా విశాఖలో అడుగుపెట్టారు గంటా శ్రీనివాసరావు. విశాఖ రాజకీయాల్లో తనదైన ముద్ర చాటుకుంటూ వస్తున్నారు. డబుల్ హ్యాట్రిక్ విజయం సాధించిన నేతగా కూడా గుర్తింపు పొందారు. ఒకసారి ఎంపీగా.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది. ఒకచోట గెలిస్తే మరోసారి అక్కడ ఆయన ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు రెండోసారి ఆయన భీమిలి నుంచి గెలిచారు. అయితే సుదీర్ఘకాలం మంత్రిగా వ్యవహరించిన ఆయనకు సమీకరణలో భాగంగా ఈసారి అవకాశం లేకుండా పోయింది. చివరి నిమిషం వరకు భీమిలి సీటు ఇస్తారా? ఇవ్వరా? అనే అనుమానం ఉండేది. కానీ చంద్రబాబు ఆయనకు చివరి నిమిషంలో అవకాశం ఇచ్చారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పై పోటీ చేసిన గంటా ఏకంగా 90 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని అంతా అంచనా వేశారు. కానీ వివిధ సమీకరణలో మాత్రం ఆయనకు చాన్స్ దక్కకుండా పోయింది.
యాక్టివ్ గా కుమారుడు
ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు( ganta Srinivasa Rao ) కంటే ఆయన కుమారుడు రవితేజ చాలా యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే షాడో ఎమ్మెల్యే ఆయనేనని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో రవితేజ తో పోటీ చేయించాలని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారు. మొన్న ఆ మధ్యన లోకేష్ కు మద్దతుగా విశాఖ నగరవ్యాప్తంగా భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో లోకేష్ టీంలో గంటా రవితేజ ఉండబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టుగానే గంటా రవితేజ ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో సైతం కుమారుడు పోటీపై క్లారిటీ ఇచ్చేశారు గంటా. టిడిపి శ్రేణులు సైతం అందుకు ఫిక్స్ అయిపోయాయి కూడా.