Telangana Elections 2023: రాష్ట్ర విభజన జరిగినా తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు హైలెట్ అవుతూ వచ్చారు. ప్రతి ఎన్నికల్లో కెసిఆర్ చంద్రబాబు ను ప్రచారాస్త్రంగా మార్చారు. చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసి.. 2014, 2018 ఎన్నికల్లో సెంటిమెంట్ రగిలించడంలో కెసిఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఆ రెండు ఎన్నికల్లో తెలుగుదేశం బరిలో దిగింది. అయితే ఈసారి వ్యూహాత్మకంగా పోటీ నుంచి పక్కకు తప్పుకున్న తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో గెలుపోవటములను నిర్దేశించే స్థాయికి చేరుకోవడం విశేషం.
తెలంగాణలో అధికార బి.ఆర్.ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అధికార బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. బిజెపి ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఓట్లయితే సాధిస్తుంది గానీ.. సీట్లు సాధించే సీన్ లేదని టాక్ నడుస్తోంది. అందుకే చంద్రబాబు టిడిపిని పోటీ చేయకుండా నియంత్రించారన్న ప్రచారం జరుగుతోంది. పైగా తెలంగాణలో ఓటమి ఎదురైతే ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై పడే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే మూల్యం చెల్లించుకోకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఎవరికోసం అన్న టాక్ నడుస్తోంది. అవినీతి కేసుల్లో చిక్కుకొని చంద్రబాబు 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. న్యాయస్థానాల్లో ఊరట దక్కడం లేదు. అటు బిజెపి అధినేతల సైతం అరెస్టు వెనుక ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండడం.. టిడిపి వెనక్కి తగ్గడం పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల కిందట బిజెపి ఆగ్రనేత అమిత్ షా తో లోకేష్ సమావేశం కావడంతో ఈ ప్రచారానికి కారణం. అయితే బిజెపి కోసమే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్నది మాత్రం తెలియడం లేదు.
చంద్రబాబు అరెస్టు తెలంగాణలో కచ్చితంగా ప్రభావం చూపుతోందని అన్ని రాజకీయ పక్షాలకు తెలుసు. గణనీయమైన సీట్లు తెచ్చే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేకపోయినా.. ఆ పార్టీకి క్యాడర్ ఉంది. ఆపై కమ్మ సామాజిక వర్గంతో పాటు సెటిలర్స్ దన్ను ఉంది. అందుకే చంద్రబాబు అరెస్ట్ విషయంలో అధికార బీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. బిజెపి నేతలు సైతం అరెస్టు చేసిన తీరును తప్పు పట్టారు. అయితే చంద్రబాబు ఎవరికి మద్దతు ప్రకటిస్తారో నన్న సస్పెన్స్ మాత్రం ఇంతవరకు వీడడం లేదు. ఇంతటి కష్టకాలంలో ఉన్న తనను, ఏపీలో తన పార్టీని గట్టెక్కించే వారికి తప్పకుండా మద్దతు తెలుపుతారని.. అందుకే తెలంగాణ ఎన్నికల నుంచి తప్పుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.