Pawan Kalyan: ఎన్నికల ముంగిట ఏపీలో కీలక పరిణామం. అధికార వైసీపీని కలవర పెట్టే విధంగా టిడిపి, జనసేన శ్రేణులు ఇట్టే కలిసిపోతున్నాయి. పొత్తు తప్పకుండా ఉంటుందన్న పవన్ మాటను.. జనసైనికులు గౌరవించారు. అటు ప్రతిపక్ష టిడిపి శ్రేణులు సైతం ఆహ్వానించాయి. ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు. కానీ రెండు పార్టీల శ్రేణుల అపూర్వ కలయిక మాత్రం ఆశ్చర్యపరుస్తోంది. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం పెరుగుతోంది. అధికార వైసీపీని గద్దె దించాలన్న కసి కనిపిస్తోంది. సహజంగా ఇది అధికార పార్టీకి కలవరపాటుకు గురి చేసే విషయమే.
సాధారణంగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే.. వందకు వందశాతం ఓట్ల బదలాయింపు జరగదు. ఏపీలో వైసీపీ సైతం ఇలాగే ఆశలు పెట్టుకుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే మాత్రం టిడిపి, జనసేనల మధ్య సమన్వయం, ఓట్ల బదలాయింపు పక్కా అని స్పష్టమవుతోంది. ఈ విషయంలో క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ దే. చంద్రబాబు అరెస్టు తర్వాత పరామర్శించిన పవన్ పొత్తు ప్రకటన చేశారు. తక్షణం ఉమ్మడి కార్యాచరణ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. టిడిపి తో పొత్తు సమన్వయానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
తొలిసారిగా ఈ రెండు పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీల సమావేశం రాజమండ్రిలో జరిగింది. పలు అంశాలపై తీర్మానాలు చేసుకున్నారు. అందులో భాగంగా గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు పార్టీలు పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. రేపటి వరకు ఈ ఆత్మీయ సమావేశాలు కొనసాగులున్నాయి. నవంబర్ 1న రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. నవంబర్ తొలివారంలో రెండు పార్టీల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ స్థాయిలో రెండు పార్టీలు కలిసిపోతాయని అధికార వైసిపి భావించలేదు. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తోంది.
పవన్ పొత్తు ప్రకటన చేసిన వెంటనే జనసేన లోని బ్రో వైసిపి నేతలు ఒక్కొక్కరు బయటకు వచ్చారు. పార్టీపై విమర్శలు చేశారు. దీనిపై పవన్ సైతం అదే స్థాయిలో స్పందించారు. పార్టీ రాజకీయ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. అటు సోషల్ మీడియాలో సైతం ఎవరు వ్యాఖ్యానించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జనసేనలోని ప్రోవైసిపీ నేతలు తోక ముడిచారు. కొందరు పార్టీని వీడారు. మరికొందరు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. అటువంటి వారంతా తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ సైతం అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా.. రెండు పార్టీల మధ్య ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇటు జనసేన, అటు టిడిపి నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత రెండు రోజులుగా ఆత్మీయ సమావేశాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. ఇవి రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపునకు దోహదపడతాయని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.