మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజధాని అమరావతిపై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని తెలిసినా చంద్రబాబు అంగీకరించరు. అమరావతిని మాత్రమే ఏపీ రాజధానిగా కొనసాగించాలనే పట్టును విడవరు. కోర్టులో పిటిషన్ల ద్వారా మూడు రాజధానుల నిర్ణయం అమలును అడ్డుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
అయితే చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ స్వర్గీయ నందమూరి తారక రామారావుపై లేదా….? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఎన్టీఆర్ పేరు చెప్పుకునే నాటి నుంచి నేటి వరకు రాజకీయాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చటమే లక్ష్యంగా పని చేస్తున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే మాటల్లో సీనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించే చంద్రబాబు నిజ జీవితంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పాఠ్య పుస్తకంలో సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది. దీంతో బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు థ్యాంక్స్ చెప్పకపోవడం గమనార్హం. కారణాలు ఏమైనా చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ ఎన్టీఆర్ పై లేకపోవడం గమనార్హం.
ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా నిత్యం జగన్ సర్కార్ పై విమర్శలు చేసే చంద్రబాబుకు తెలంగాణ సర్కార్ ను ప్రశంసించడానికి సమయం దొరకలేదా…? అని నందమూరి అభిమానుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎన్టీఆర్ పేరు కలకాలం నిలిచేపోయే పనులు మాత్రం చంద్రబాబు చేయలేదు. చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ విషయంలో వ్యవహరిస్తున్న ధోరణి వల్ల భవిష్యత్తులో చంద్రబాబు నందమూరి అభిమానుల మద్దతు కూడా కోల్పోయే అవకాశం ఉంది.