Chandrababu- Media: ఓహో మీడియా అంటే మీకు వంత పాడాలా?.. బాబును పూనిన కేసీఆర్

నెల్లూరులో సభ పెట్టినప్పుడు, గుంటూరులో సభ పెట్టినప్పుడు చాలామంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. ఇందుకు కారణం సభ నిర్వహణ లోపం. దీనిని బాధ్యతగల మీడియా ప్రసారం చేయడం తప్పు ఎలా అవుతుంది?

Written By: Bhaskar, Updated On : May 10, 2023 5:52 pm

Chandrababu- Media

Follow us on

Chandrababu- Media: మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్. సమాజానికి, ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉండేది. అలాంటి మీడియా మీద ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఒంటి కాలు మీద లేచారు. తాము అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేల్చుతామని హెచ్చరించారు. వాస్తవానికి చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీడియాపై ఎన్నడు కూడా విమర్శలు చేయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ మీద కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఈమధ్య ఏమైందో తెలియదు కానీ ఒక సెక్షన్ మీడియాకు బ్లూ మీడియా అని నామకరణం చేశారు. అంతేకాదు అది ఒక వర్గం వార్తలు మాత్రమే రాస్తుందని, ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమాలపై ఫోకస్ చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చెప్పాలంటే తన శిష్యుడు కెసిఆర్ మీడియాను వంద మీటర్ల లోతులో బొంద పెడతా అని హెచ్చరించినట్టు, చంద్రబాబు కూడా తనకు నచ్చని మీడియాను అలానే చేస్తానని సంకేతాలు పంపారు.

ఇవాళ సుద్దులు

ఇవాళ మీడియా మీద రంగులు వేస్తున్న చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు ఈనాడును ఏ విధంగా వాడుకున్నది, తాను అధికారంలో ఉన్నప్పుడు అనుకూల మీడియాకి ఏ విధంగా కోట్లకు కోట్లు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చింది, తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని ఎన్ టీవీ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని ఏ రూపంలో బయటకు పంపించింది జగత్ విధితమే. మీడియాను ఎంత వత్తాలో అంత వత్తి.. ఈరోజు ప్రతిపక్షంలోకి వెళ్ళగానే నీతి సూక్తులు వల్లించడం చంద్రబాబుకే చెల్లింది. తన అనుకూల మీడియా అధికార పక్షం పైన ఎలాంటి వార్తలు రాస్తుందో, వ్యక్తిత్వాలను ఎలాంటి హనానికి గురిచేస్తుందో చంద్రబాబుకు తెలియదా? దీని వెనక చంద్రబాబు లేడు అనుకోవాలా? ఒక సెక్షన్ మీడియా చంద్రబాబు నాయుడుని విస్మరించడం లేదు. చేస్తున్న కార్యక్రమాలకు విశేషమైన ప్రాధాన్యం కల్పిస్తూనే ఉంది. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి మీడియా ముఖ్యమంత్రి వార్తలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో తెలియదా? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి పత్రిక కూడా పతాక శీర్షికలో వార్తలు రాసింది. మరి దాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రస్తావించడం లేదు? తన అనుకూల మీడియా ప్రభుత్వం మీద ఎలాంటి విషం కక్కుతోందో? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా స్వరం వినిపిస్తే ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో ప్రజలకు తెలియదా? అది తెలియదు అనుకుంటే అమాయకత్వమే అవుతుంది.

ఏం ఎందుకు చూపించాలి?

నెల్లూరులో సభ పెట్టినప్పుడు, గుంటూరులో సభ పెట్టినప్పుడు చాలామంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. ఇందుకు కారణం సభ నిర్వహణ లోపం. దీనిని బాధ్యతగల మీడియా ప్రసారం చేయడం తప్పు ఎలా అవుతుంది? అలా ప్రసారం చేస్తే ఆ మీడియా మొత్తం బ్లూ మీడియా అయిపోతుందా? ఇదెక్కడి సూత్రికరణ బాబు గారు? వాస్తవానికి మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. అది ఒక వాచ్ డాగ్. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ ఉంటుంది. కానీ అలాంటి మీడియాకు వక్ర భాష్యం అద్దడం ఎంతవరకు సరైంది? ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల సమస్యల మీద చంద్రబాబు నాయుడు పోరాటం చేయాలి. ఆ పోరాట పటిమ గనుక ప్రజలకు నచ్చితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కట్టబెడతారు.. కానీ ప్రజల వాయిస్ ఎలా ఉందో తెలుసుకోకుండా తాను చేస్తున్న కార్యక్రమాలను మీడియా బాగా ఫోకస్ చేయాలని చంద్రబాబు కోరుకోవడం ఏమిటి?

అనుకూల మీడియా ట్రాప్ లో పడ్డారు

వాస్తవానికి చంద్రబాబు ప్రస్తుతం తన అనుకూల మీడియా ట్రాప్ లో పడ్డారు. 2019లో ఇదే అనుకూల మీడియా చంద్రబాబు నాయుడుకు లేనిపోనివన్నీ చెప్పింది. వాటిని నిజం అనుకొని చంద్రబాబు అలా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఫలితంగా తన రాజకీయ జీవితంలో అత్యంత దారుణమైన ఓటమిని చవిచూశారు. 23 సీట్లకే పరిమితం అయిపోయారు. ప్రస్తుతం అధికారం కోసం అనేక తిప్పలు పడుతున్నారు.. వైపు చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాల్లో పర్యటిస్తుంటే, ఆయన కుమారుడు పాదయాత్ర చేస్తున్నారు. అన్నట్టు లోకేష్ పాదయాత్రకు మొదట్లో విశేషమైన కవరేజ్ ఇచ్చిన అనుకూల మీడియా.. ఇప్పుడు పట్టించుకోవడం మానేసింది. కేవలం జిల్లాలో తప్పితే మెయిన్ పేజీల్లో అంతంతమాత్రంగానే వార్తలు ప్రచురిస్తోంది. దీనిని చంద్రబాబు నాయుడు ఏ విధంగా చూస్తారో ఆయనకే తెలియాలి. ఒకటి మాత్రం నిజం. మీడియా అనేది వర్టికల్ గా డివైడ్ అయింది. కానీ ఇవాల్టికి కొన్ని కొన్ని మీడియా సంస్థలు విలువలు పాటిస్తున్నాయి. అలాంటి మీడియా సంస్థలు కూడా తనకు వంగి వంగి సలాం చేయాలని చంద్రబాబు కోరుకోవడం నిజంగా బాధాకరం.