Devineni Uma: ఏపీలో రెండు పార్టీలతో టిడిపి పొత్తులు కుదుర్చుకోనుంది. పొత్తు అనేది ఆ రెండు పార్టీల కంటే తెలుగుదేశం పార్టీకే కీలకం. వచ్చే ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. అందుకే చంద్రబాబు త్యాగాలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కొంతమందికి సీట్లు ఉండవని తేల్చేశారు. అటువంటి జాబితాలో సీనియర్లు సైతం ఉండడం విశేషం.ఒకరిద్దరు నాయకులకు చంద్రబాబు ఇప్పటికే చెప్పేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ లీడర్ దేవినేని ఉమాకు చంద్రబాబు షాక్ ఇచ్చారని తెలుస్తోంది. ఈసారి మైలవరం టికెట్ ఇవ్వడం లేదని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుండడం గమనార్హం.
దేవినేని ఉమా చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేత. లోకేష్ కు సైతం ఇష్టమైన నేతగా గుర్తింపు పొందారు. అటువంటి నాయకుడికి టిక్కెట్ లేదని చెప్పడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దేవినేని ఉమా 1999 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సోదరుడు దేవినేని వెంకటరమణ మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో మరోసారి అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నందిగామ కనుమరుగైంది. దీంతో 2009 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉమా గెలుపొందారు. 2014లో సైతం అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉమా మంత్రిగా కూడా వ్యవహరించారు. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో సైతం మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఉమా భావిస్తున్నారు. కానీ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు తెలుస్తోంది.
మైలవరంలో దేవినేని ఉమా కు వ్యతిరేకంగా పార్టీలో ఒక వర్గం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇస్తే సహకరించమని ఒక వర్గం తేల్చి చెబుతోంది. ఆయన స్థానికేతురుడని.. స్థానికుడైన తనకు టికెట్ ఇవ్వాలని సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కోరుతున్నారు. సందట్లో సడే మియా అన్నట్టు ఇప్పుడు పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రానున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో టికెట్ దక్కే ఛాన్స్ ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ రాజీనామా చేశారు. త్వరలో టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వసంత కృష్ణ ప్రసాద్ కు టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే దేవినేని ఉమాకు స్థానచలనం తప్పదని ప్రచారం జరుగుతోంది. అయితే నమ్మకమైన నేతగా గుర్తింపు పొందిన ఉమాకు చంద్రబాబు ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది చూడాలి.