Pawan Kalyan- Chandrababu: టిడిపి,జనసేనల మధ్య పొత్తులు కుదిరాయి. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే వెళ్తాయని పవన్ ప్రకటించారు. బిజెపి వస్తే కలుపుకొని వెళతామని స్పష్టం చేశారు. అయితే ఇంతటి ఆగమేఘాల మీద పొత్తు ప్రకటన రావడం అధికార వైసీపీకి మింగుడు పడడం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును పవన్ కలిసిన సంగతి తెలిసిందే. లోకేష్, బాలకృష్ణ లతో కలిసి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ సుదీర్ఘంగా 40 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశారు.
అయితే ఇంతకుముందే రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని వార్తలు వచ్చాయి. ఎన్నికలకు ముంగిట పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకుంటామని ఇరు పార్టీల అధినేతలు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు సడన్ గా పొత్తులు పెట్టుకుంటామని పవన్ ప్రకటించేసరికి రాజకీయ సంచలనం గా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ ఏం చర్చించారు? వారి మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి? ముందుగా ఎవరు పొత్తులకు ఆసక్తి చూపారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు రిమాండ్ ఖైదీగా మూడు రోజులు పాటు ఉన్నారు. ఆయనను లాయర్లు, కుటుంబ సభ్యులు మాత్రమే కలుసుకున్నారు. అయితే పవన్ పరామర్శిస్తారని ముందు రోజే మీడియాకు లీకులు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే మూలఖత్ కు పార్టీ శ్రేణులు దరఖాస్తు చేసుకున్నాయి. నిన్న ముందుగా బాలకృష్ణ రాజమండ్రి చేరుకోగా.. తరువాత పవన్ వచ్చారు. బాలకృష్ణ, లోకేష్ లతో కలిసి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. ఇలా వెళ్లిన వెంటనే పవన్ చంద్రబాబు యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు. తాను విజయవాడ వచ్చే ప్రయత్నం చేశానని.. పోలీసులు అడ్డుకున్న విషయాన్ని చంద్రబాబుకు వివరించారు.
అయితే నేరుగా పవన్ పాయింట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తు ప్రకటన చేద్దామని పవన్ ముందుకు వచ్చినట్లు సమాచారం. దానిపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఇంత తొందరగానా అని విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే కీలక సమయమని పవన్ చెప్పినట్లు సమాచారం. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని పవన్ ప్రశ్నించడంతో చంద్రబాబు మౌనం పాటించారు. పొత్తు ప్రకటనకు మొగ్గు చూపారు.అందుకే పవన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. పొత్తు పై కీలక ప్రకటన చేశారు.