Chandrababu: చంద్రబాబు అరెస్టు.. నష్టాల్లో హెరిటేజ్..

చంద్రబాబు నాయుడుకి ఉన్న బలమైన ఆర్థిక స్తంభాల్లో హెరిటేజ్ కూడా ఒకటి. ఈ సంస్థ పాలు, పాల ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది. అయితే మొన్నటిదాకా ఈ సంస్థ మంచి లాభాలనే గడించింది.

Written By: K.R, Updated On : September 15, 2023 1:18 pm

Chandrababu

Follow us on

Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం విఫల యత్నం చేస్తున్నారు. ఏపీ సి ఐ డి రోజుకో కొత్త కేసును వెలుగులోకి తెస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ క్రమంలో పులి మీద పుట్రలాగా టిడిపికి హెరిటేజ్ రూపంలో మరొక షాక్ తగిలింది.

చంద్రబాబు నాయుడుకి ఉన్న బలమైన ఆర్థిక స్తంభాల్లో హెరిటేజ్ కూడా ఒకటి. ఈ సంస్థ పాలు, పాల ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది. అయితే మొన్నటిదాకా ఈ సంస్థ మంచి లాభాలనే గడించింది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఒక్కసారిగా ఈ సంస్థ పతనం ప్రారంభమైంది. గత శనివారం చంద్రబాబునాయుడు ను అరెస్టు చేసిన నేపథ్యంలో.. జరిగిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర దాదాపు 19 శాతం క్రాష్ అయింది. షేర్ ధర 12.5% అంటే 32 రూపాయలు క్షీణించింది. ప్రస్తుతం 221 వద్ద ట్రేడ్ అవుతోంది.. భారీ వాల్యూమ్ కొనసాగడంతో ఇప్పటికే 24 లక్షల హెరిటేజ్ షేర్లు చేతులు మారాయి. షేరు ధర పడిపోవడం చూస్తుంటే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం కనిపించినట్టు తెలుస్తోందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు అంటే శుక్రవారం నాటికి ట్రేడింగ్ ధర 272 వద్ద ఉంది. అయితే ఆయన అరెస్టు తర్వాత షేరు ధర కుప్పకూలడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్ల సంపద కూడా ఆవిరైంది. ఇక శనివారం నుంచి పతనం ప్రారంభం కావడంతో మార్కెట్ లో కంపెనీ క్యాపిటలైజేషన్ ఏకంగా 450 కోట్ల మేర కరిగిపోయింది. ప్రస్తుతం 2,073 కోట్లకు దిగివచ్చింది అని తెలుస్తోంది.

హెరిటేజ్ ఫుడ్స్ షేరు ఈ ఏడాది గరిష్ట స్థాయిలో రూ. 287 ను తాకింది. కనిష్ట స్థాయిలో 135 గా నమోదయింది. కంపెనీలో ప్రమోటర్లకు అంటే చంద్రబాబు కుటుంబానికి 41.58 శాతం వాటా ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం వరుసగా చార్జి షీట్లు దాఖలు చేస్తున్న నేపథ్యంలో హెరిటేజ్ ఇన్వెస్టర్లు భయపడిపోతున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు హెరిటేజ్ ఫుడ్స్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెంబడి భూములు కొనుగోలు చేసిందని ఏపీ సిఐడి అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం స్కిల్ కేసులోనే దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి కూడా సిఐడి దృష్టిసారిస్తుందని.. హెరిటేజ్ కొనుగోలు చేసిన భూములపై కూడా ఆరా తీస్తుందని.. అప్పుడు తాము హెరిటేజ్ సంస్థను నమ్మి పెట్టుబడులు పెట్టలేమని ఇన్వెస్టర్లు అంటున్నట్టు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే కొనసాగితే హెరిటేజ్ షేర్ మరింత కుప్పకూలే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.