Chandrababu: ఏ ప్రభుత్వమైనా.. ఏ నాయకుడైనా మద్య నిషేధం చేస్తామని హామీ ఇస్తారు. పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యం రక్కసిని రాష్ట్రం నుంచి పార దోలుతానని ప్రజలకు భరోసా ఇస్తారు. తన మనసులో వేరే ఆలోచన ఉన్నా… మెజారిటీ ప్రజల మద్దతు పొందేందుకైనా మద్య నిషేధం ప్రకటన చేస్తారు. కానీ 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. అందరికంటే తాను ఒక భిన్నమైన నాయకుడిగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది.
గత ఎన్నికలకు ముందు జగన్ విస్పష్ట ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తామని ప్రకటించారు. తన నవరత్నాల పథకంలో సైతం మద్య నిషేధానికి చోటిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక అమలు చేయలేకపోయారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ధరలను విపరీతంగా పెంచేశారు. కొత్త కొత్త బ్రాండ్లను తెరపైకి తెచ్చారు. అయితే దీనిపై విమర్శలు రేగుతున్నాయి. పేదలపై భారం మోపుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మద్య నిషేధం విషయంలో జగన్ మాట తప్పారని విమర్శలకు దిగుతున్నాయి. అంతవరకు బాగానే ఉంది కానీ.. తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని విపక్షాలు ప్రకటించలేకపోతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం రాయలసీమలో ప్రాజెక్టుల బాట చేపడుతున్నారు. అయితే ఆయన చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తాం అన్న ప్రకటన చేశారు. ఒక బాధ్యతాయుతమైన విపక్ష నేతగా మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పలేదు.. జగన్ మంచి మద్యాన్ని అందించలేకపోతున్నారని.. ధర పెంచేశారని ఆక్షేపించారు. కానీ జగన్ మద్య నిషేధం అమలులో ఫెయిల్యూర్ అయ్యారని మాత్రం చెప్పలేకపోతున్నారు. తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం చేస్తామని కూడా హామీ ఇవ్వలేకపోతున్నారు. కేవలం మందుబాబులను ఆకట్టుకోవడానికి మాత్రమే చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.
మద్యం ధరలను తగ్గించి.. నాణ్యమైన మద్యాన్ని అందిస్తానని చంద్రబాబు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు మద్యం ధరలతో ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఆయన పరిగణలోకి తీసుకున్నట్లు ఉంది. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా.. ఇటువంటి ప్రకటనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం చంద్రబాబుపై ఉంది. ప్రజలకు నిషేధం వద్దని.. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందించాలని వారు కోరుకుంటున్నట్లుగా చంద్రబాబు భావన ఉంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.. మద్యం విక్రయాలు.. అందుకే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తానని చెప్పడం ఒక నీతి. కానీ చంద్రబాబు మాత్రం ఆ మాట చెప్పడం లేదు. జగన్ నెరవేరుస్తానన్న మద్య నిషేధం తాను అమలు చేస్తానని ముందుకు రావడం లేదు. కేవలం నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తానని మాత్రమే చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రకటన విమర్శలకు గురవుతోంది.