Chandrababu On Rayalaseema: రాయలసీమ పై చంద్రబాబు ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించాలని భావిస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలోదించాలని డిసైడ్ అయ్యారు. పొత్తులు ఉన్నా లేకపోయినా..ఆర్థిక, అంగ బలం ఉన్న నేతల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
సాధారణంగా రాయలసీమ అంటేనే వైసిపికి పట్టున్న ప్రాంతం. గత ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేసింది ఆ పార్టీ. అందుకే ఈసారి ఆ దూకుడుకు కట్టడి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు రాయలసీమ నుండి పొందాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. వైసిపి బాధిత వర్గాలను చేరదీయాలని చూస్తున్నారు. ముఖ్యంగా జగన్ సొంత సామాజిక వర్గం తోనే వైసీపీని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు.
అనంతపురంలో జెసి బ్రదర్స్, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబం అండదండలు తీసుకోవాలని చూస్తున్నారు. కర్నూలులో సైతం రెడ్డి సామాజిక వర్గాన్ని టిడిపి వైపు మళ్లించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్త ప్రాజెక్టుల సందర్శనను రాయలసీమ నుంచి శ్రీకారం చుట్టారు. పనిలో పనిగా కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. ఈయన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు. గత ఎన్నికల తర్వాత ఆదినారాయణ రెడ్డి బిజెపిలో చేరారు. ఆయన సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి మాత్రం టిడిపిలోనే ఉండిపోయారు. అయితే భూపేష్ రెడ్డినే తన రాజకీయ వారసుడిగా ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి టిడిపిలోనే ఉండేవారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా.. చంద్రబాబు వీరిద్దరిని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా.. రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు అభ్యర్థిగా పోటీ చేయించారు. కానీ అనూహ్యంగా ఇద్దరూ ఓడిపోయారు. టిడిపికి దూరమయ్యారు. ఇప్పుడు భూపేష్ రెడ్డి అభ్యర్థి కావడం.. గతంలో రాజకీయ వారసుడి గా ప్రకటించడంతో ఆదినారాయణ రెడ్డి సపోర్టు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాయలసీమ వ్యాప్తంగా ఉన్న 52 నియోజకవర్గాల్లో ఇదే ఫార్ములాతో చంద్రబాబు ముందుకెళ్లాలని భావిస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.