https://oktelugu.com/

Chandrababu And Pawan Kalyan: వైసీపీది దొడ్డిదారి.. ఈసీకి చంద్రబాబు, పవన్ ఫిర్యాదు

గత కొద్దిరోజులుగా ఓటర్ల జాబితా పై పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ విపక్షాల నుంచి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Written By: , Updated On : January 9, 2024 / 04:40 PM IST
Chandrababu And Pawan Kalyan

Chandrababu And Pawan Kalyan

Follow us on

Chandrababu And Pawan Kalyan: ఏపీలో ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ విజయవాడకు చేరుకున్నారు. అధికారులతో రివ్యూలు జరిపారు. ఏర్పాట్లపై సమీక్షించారు. వీరిని టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత కొద్దిరోజులుగా ఓటర్ల జాబితా పై పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ విపక్షాల నుంచి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన అధికారులకు ఇదే అంశంపై విపక్ష నేతలు ఫిర్యాదు చేయడం విశేషం.ముఖ్యంగా మార్పులు, చేర్పుల్లో అవకతవకలు జోరుగా సాగుతున్నాయని.. దీనికి అడ్డుకట్ట వేయాలని అధికారులకు ఇరువురు నేతలు కోరారు.

ఎన్నికల అధికారులతో సమావేశం అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. వైసిపి పాలనలో ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపించారు. విపక్షాలపై వేలాది కేసులు నమోదు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల ఇప్పుడు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే వేలాది ఓట్లను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పరిణామాలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రబాబు వివరించారు.

తెలంగాణ మాదిరిగా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల అధికారులను ఇద్దరు నేతలు కోరారు. అలాంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు, ఇతర భద్రతా బలగాలను ఏపీకి పంపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి ఒక ప్రత్యేకంగా సెల్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఒక్క దొంగ ఓటు కూడా పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల్లో నివసించే వారికి ఓటు హక్కు కల్పించొద్దని చెప్పడం సరికాదని.. రెండు చోట్ల ఓటు ఉండడం నేరమని.. అయితే ఇతర రాష్ట్రాల్లో ఓట్లు లేని వారికి మాత్రం ఇక్కడ అవకాశం కల్పించాలని ఎలక్షన్ కమిషన్ అధికారులకు చంద్రబాబు, పవన్ లు కోరారు.