Chandrababu Naidu shocked Devineni Uma
Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మూడో జాబితాలో సైతం ఆయన పేరు లేదు. చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత విధేయుడు దేవినేని ఉమ. ఈయనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందునే గతంలో కొడాలి నాని టిడిపికి దూరమయ్యారు. చాలామంది నేతలు టిడిపి నుంచి బయటకు వెళ్లి పోవడానికి కారణం.. దేవినేని ఉమాకు ప్రాధాన్యం ఇవ్వడమే. అటువంటి ఉమాకు ఈసారి టికెట్ లేనట్టే. ఆయన ఆశిస్తున్న మైలవరం టిక్కెట్ ను వసంత కృష్ణ ప్రసాద్ కు, లేకుంటే సర్దుబాటు చేస్తారన్న పెనమలూరు టికెట్ ను బోడె ప్రసాద్ కు చంద్రబాబు కేటాయించారు. దీంతో దేవినేని ఉమాను గాల్లో ఉంచారు. ఆయన సేవలను ఎలా వినియోగించుకుంటారు అన్నది చూడాలి.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గడప దాటలేని స్థితిలో దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. పార్టీతో పాటు నాయకత్వానికి అత్యంత విధేయుడు కూడా. ఎట్టి పరిస్థితుల్లో టిడిపికి దూరం కారు. ఆయనకు ఆప్షన్ లేదు కూడా. అయితే దేవినేని ఉమా లాంటి నేతను చంద్రబాబు పక్కన పెట్టారంటే అందుకు సరైన రీజన్ ఉంటుందని తెలుస్తోంది. ఆయనకు ముందస్తుగా సమాచారం ఇచ్చి.. ప్రత్యామ్నాయం చూపి.. అటు మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు, ఇటు పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. కానీ తాజాగా మూడో జాబితాలో తన పేరు లేకపోవడాన్ని మాత్రం దేవినేని ఉమా జీర్ణించుకోలేకపోతున్నారు.
గత ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉమా పోటీ చేశారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఐదేళ్లుగా ఆ ఇద్దరు నేతల మధ్య వార్నింగులు నడుస్తున్నాయి. డైలాగులు వార్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు కృష్ణ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఆమోదించడం వెనుక.. ఉమా నుంచి అభిప్రాయం తీసుకొని ఉంటారని తెలుస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు కోసం కృషి చేస్తానని ఉమా హామీ ఇచ్చి ఉంటారని సమాచారం. చంద్రబాబుకు విధేయత కలిగిన నాయకుల్లో ఉమా ఒకరు. ఆయనకు చెందిన నియోజకవర్గంలో వేరొకరికి టికెట్ ఇస్తున్నారంటే తప్పకుండా ఆయన అభిప్రాయాన్ని తీసుకుని ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే అధినేత ఆదేశాలను పాటించి.. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ కు దేవినేని ఉమా సహకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.