Vizag Port: మొన్నటివరకు విశాఖ ప్రశాంత నగరం. సువిశాల తీర ప్రాంతం, అంతర్జాతీయ ఎగుమతులకు, దిగుమతులకు అనుకూలంగా ఉండే పోర్ట్, పలు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ఉత్తరాది రాష్ట్రాలతో లింకులు ఉండేది విశాఖ నగరం. కానీ ఎన్నడూ అసాంఘిక కార్యకలాపాలు, విధ్వంసాలకు అవకాశం లేకపోయేది. నావల్ డాక్ యార్డ్, హెచ్పీసీఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్, బి హెచ్ పి వి వంటి సంస్థల్లో ఉత్తరాది రాష్ట్రాల వ్యక్తులు పని చేసినా.. నేర సంస్కృతికి సంబంధించి ఎటువంటి ఘటనలు జరిగేవి కావు. కానీ ఉన్నట్టుండి ప్రపంచమే ఉలిక్కిపడేలా.. 25 వేల కిలోల డ్రగ్స్ పట్టు పడటం సంచలనం సృష్టిస్తోంది.
సాధారణంగా డ్రగ్స్ కలకలం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఫస్ట్ టైం విశాఖలో గరుడ ఆపరేషన్ పేరిట సిబిఐ ఒక కంటైనర్ను పట్టుకోవడం.. అందులో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టు పడడం ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ పోర్టులోకి ఆ స్థాయిలో డ్రగ్స్ రావడం చిన్న విషయమా? సాధారణంగా ఒక గ్రాముల డ్రగ్ ను 15000 రూపాయలకు అమ్ముతారు. అటువంటిది పాతిక వేల కిలోలు అంటే.. దాని విలువ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ డ్రగ్ ను ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరికి అమ్ముతారు? ఎలా రవాణా చేస్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న ఇది. దీనికి ఎంతో పెద్ద నెట్వర్క్ అవసరం.
సరుకు వచ్చింది బ్రెజిల్ నుంచి. తెచ్చింది అంతర్జాతీయ ముఠా. కానీ చలామణి చేయాల్సింది విశాఖలో.అంతర్జాతీయ ముఠా విశాఖలో క్యాంపు పెట్టి మరి డ్రగ్స్ విక్రయానికి సిద్ధపడిందంటే.. దీని వెనుకున్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సీరియస్ గా వ్యవహరిస్తే దీని మూలాలు ఇట్టే బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడుఅందరి కళ్ళు ఏపీ వైపే ఉన్నాయి.అందరి వేళ్ళు ఇటే చూపిస్తున్నాయి. అందుకే ఈ మిస్టరీని ఛేదించి బయటపెట్టాల్సిన అవసరం కేంద్ర దర్యాప్తు సంస్థపై ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.