Chandrababu: చంద్రబాబు ప్రజల్లోకి రానున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు.అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు తొలుత మధ్యంతర బెయిల్ లభించింది.తరువాత రెగ్యులర్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయంపై ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే అత్యున్నత న్యాయస్థానం రాజకీయ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నారు. ఈ తరుణంలో ఆయన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి కీలక షెడ్యూల్ ఒకటి విడుదల అయింది. ఈ నెల 10 నుంచి 15 వరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటన ఖరారు అయ్యింది. అయితే అవి భారీ బహిరంగ సభలు కావు.ర్యాలీలు అంతకంటే కావు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ సర్కార్ హయాంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. నిధులు, విధులు లేకుండావారు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది. రాజ్యాంగబద్ధ నిధులు సైతం మళ్లిస్తున్నారు. దీంతో పంచాయతీ ఖాతాల్లో చిల్లిగవ్వ కూడా లేకుండా పోతోంది. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఈ తరుణంలో పంచాయతీ సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధంగా కూడా కనిపిస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పొలిటికల్ రీఎంట్రీ తర్వాత వారిపైనే గురి పెట్టారు.
రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రస్తుతం టిడిపి సానుభూతిపరుల ఆధీనంలో ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో సర్పంచుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాలో నిర్వహించిన సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వ తీరుపై సర్పంచులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని.. వారికి మద్దతు తెలపడం ద్వారా తమ వైపు తిప్పుకోవచ్చని టిడిపి భావిస్తోంది. ఇప్పటికే చాలామంది సర్పంచులు వైసీపీకి దూరమయ్యారు. టిడిపి జనసేనల వైపు చూస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు పావులు కాదపడం విశేషం.తెలుగుదేశం, జనసేనలోకి సర్పంచుల చేరిక ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు ప్రయత్నాలు ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.