Jagan Vs Chandrababu: జగన్ తట్టుకోగలడా?

జగన్ సర్కార్ పై మీడియాలో వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 80% మీడియా సర్కార్కు వ్యతిరేకంగానే ఉంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు.

Written By: Dharma, Updated On : August 16, 2023 2:02 pm

Jagan Vs Chandrababu

Follow us on

Jagan Vs Chandrababu: ఏపీలో జగన్ చుట్టూ టిడిపి వలయం పన్నుతోంది. ముప్పేట దాడి చేస్తోంది. 2014లో ఇదే మాదిరిగా వ్యవహరించి సక్సెస్ అయ్యింది. 2019లో మాత్రం టిడిపి ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు మరోసారి పట్టు బిగించేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోంది. మీడియా, మిత్రపక్షం జనసేన, ప్రభుత్వ బాధిత వర్గాలు.. ఇలా త్రిముఖ వ్యూహంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

జగన్ సర్కార్ పై మీడియాలో వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 80% మీడియా సర్కార్కు వ్యతిరేకంగానే ఉంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. తెల్లారి లేచింది మొదలు ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు వండి వార్చే ఈనాడు,ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా సంస్థలు ఉన్నాయి. వీటిపై పార్టీ ముద్ర ఉన్నా.. జగన్ సర్కార్ పై వీరు రాసే రాతలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. అందుకే జగన్ సైతం ఈ సెక్షన్ ఆఫ్ మీడియాను దుష్ట చతుష్టయం తో పోల్చారు.

మరోవైపు టిడిపి చెబితే ప్రజలు నమ్మని నిజాలను.. పవన్ తో చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో సైతం భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అవే ఆరోపణలు వైసీపీపై చేస్తే టిడిపిని నమ్మేస్థితిలో ప్రజలు లేరు. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ చే ఆరోపణలు చేయిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వారాహి యాత్ర చేపడుతున్న పవన్.. భూకబ్జాలు, వైసిపి నేతల అవినీతిని క్షేత్రస్థాయిలో ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. పవన్ నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తుండడంతో వైసీపీ వెన్నులో వణుకు ప్రారంభమైంది.

జగన్ సంక్షేమ పథకాలతో మరోసారి గెలుపు పొందాలని భావిస్తున్నారు. సంక్షేమంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మిగతా వర్గాలుజగన్ పై ఆగ్రహంగా ఉన్నాయి.వారందరినీ తన వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యాన్ని చంద్రబాబు క్షేత్రస్థాయిలో బయటపెట్టారు. ఇప్పుడు 2047 విజన్ పేరిట భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు. ప్రభుత్వ బాధిత వర్గాలుగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యారంగం ప్రముఖులు, వైద్యులు.. ఇలా అన్ని రంగాల ప్రముఖులను తన వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కొంతవరకు వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. 2014 వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. జగన్ను వలయంలో బంధించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి మరి.