Chandrababu: విశ్వసనీయత.. ఈ పదం మనకు ఏపీలో చాలాసార్లు వినిపించిన మాట. ముఖ్యంగా దీన్ని గత ఎన్నికల్లో జగన్, చంద్రబాబు బలంగా ఉపయోగించారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని గతంలో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు జగన్ వినిపించిన మాట. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా దీన్ని వాడుకోబోతున్నట్టు సమాచారం. ఆయన కూడా జగన్ మీద ప్రజల్లో విశ్వసనీయత లేదనే వాదనను వినిపించేందుకు రెడీ అవుతున్నారంట.
ఇందుకు ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కారణం అని చంద్రబాబు చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరుసగా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం, మండలి రద్దు నిర్ణయం లాంటివి యూటర్న్ జగన్ అని ముద్ర పడేస్తున్నాయి. గతంలో జగన్ పట్టుబట్టి ఈ రెండు బిల్లుల్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇన్ని రోజులుకు ఆయన తీసుకొచ్చిన బిల్లులను ఆయనే వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.
ఇక ఇప్పుడు ఉద్యోగుల విషయానికి వస్తే సీఎం అయిన తర్వాత జగన్ 27 శాతం భృతిని ఇస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అలాగే సీపీఎస్ రద్దు కూడా హామీగా ఇచ్చారు. అయితే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చల సందర్భంగా ఆయన తో పాటు సీఎస్ చేసిన కామెంట్లు షాకింగ్ గా ఉన్నాయి. తమకు మొదట్లో సీపీఎస్ గురించి టెక్నికల్ గా తెలియదని, కానీ దాన్ని రద్దు చేయాంలటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నట్టు వారు మాట్లాడటం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు అస్త్రంలా మారిందనే చెప్పొచ్చు.
Also Read: YCP MPs: ఏపీని ఆదుకోవాలంటున్న ఎంపీలు.. పార్లమెంటులో దీనంగా వేడుకోలు
ఎందుకంటే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే నిర్ణయాలు వెనక్కు తీసుకుంటే యూటర్న్ బాబు అంటూ ముద్ర వేశారు. ఇప్పుడు జగన్ కూడా ఇలాగే నిర్ణయాలు వెనక్కు తీసుకోవడంతో ఆయన్ను కూడా యూటర్న్ జగన్ అనే ముద్ర వేయాలని చూస్తోంది టీడీపీ. ఇక దీంతో పాటు ప్రత్యేక హోదా మీద కూడా జగన్ యూటర్న్ తీసుకున్నారని ఎప్పటి నుంచో టీడీపీ బలంగా ప్రచారం చేస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో జగన్ మాటిస్తే నిలబెట్టుకుంటాడనే నినాదం మీద ఎఫెక్ట్ పడుతోంది. జగన్ మాట తప్పుతాడంటూ ప్రచారం చేసేందుకు జగనే అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది.