Chandrababu- Junior NTR: అవసరం ఎంత పనైనా చేయిస్తుందంటారు. పరిస్థితి చేయి దాటినప్పుడు ప్రత్యర్థిని సైతం ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబుకు అదే పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు టీడీపీకి జీవన్మరణ సమస్యే. ఓటమి చవిచూస్తే తన రాజకీయ కెరీర్ ను అపజయంతో ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అటు రెండున్నర దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న టీడీపీ కళ్లెదుటే పేకమేడలా కుప్పకూలుతుంది. ఆ విషయం తెలిసే కాబోలు చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం ఎంత కష్టపడాలో అంతలా పడుతున్నారు. అటు పొత్తుల కోసం ప్రయత్నిస్తూనే పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. మరో వైపు వైసీపీ ప్రభుత్వం కేసులు, జీవోల పేరిట ఉక్కుపాదం మోపాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో.. చెప్పకనే చెప్పింది. అందుకే చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. తాజాగా పొలిటికల్ సర్కిల్ లో ఒక వార్త హాట్ టాపిక్ గా నిలిచింది. అదే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కానున్నట్టు ప్రచారం జరుగుతోంది.

నందమూరి నట వారసుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్. విలక్షణమైన నటనతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అయితే ఆయనకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటానని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేశారు. అప్పుడే ప్రమాదానికి గురికావడం, ఆఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూడడంతో అప్పటి నుంచి రాజకీయాల వైపు పెద్దగా కనిపించలేదు. తన సన్నిహితుడు కొడాలి నాని టీడీపీ నుంచి వైసీపీలో చేరినప్పుడు మాత్రం స్టేట్ మెంట్ ఇచ్చారు. నాని వైసీపీలో చేరికతో తనకెలాంటి సంబంధం లేదని.. తన తాత స్థాపించిన టీడీపీలోనే ఉంటానని.. అవసరమనుకుంటే పార్టీకి సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అప్పట్లో ప్రకటించారు. అటు తరువాత సినిమాలపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
అయితే ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జూనియర్ బీజేపీ వైపు అడుగులేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. అటు తెలుగునాట ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ కూడా జూనియర్ ను ఆకర్షించే పనిలో ఉందని కామెంట్స్ వినిపించాయి. అయితే వీరి మధ్య జరిగిన చర్చలేమిటి? అన్నది బయటకు రాలేదు. బీజేపీ నేతలు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ నటనను అభినందించేందుకే అమిత్ షా పిలిపించుకొని మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై జూనియర్ కూడా పెద్దగా స్పందించలేదు. కాని వీరిద్దరి కలయిక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచింది.

ప్రస్తుతం జూనియర్ సినీ కెరీర్ ను మరింత ఉన్నతంగా మలుచుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. గోల్టెన్ గ్లోబ్ అవార్డు అందుకునేందుకు కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. అటు నుంచి హైదరాబాద్ రాగానే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి జూనియర్ ను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. అటు ఎంపీకానీ.. ఎమ్మెల్యేగా కానీ పోటీచేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తో జూనియర్ కు గ్యాప్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి ప్రచారానికి వస్తాడా? పోటీకి సిద్ధపడతాడా? అన్నది డౌటే. కానీ ఎవరినైనా కన్వెన్స్ చేయగల సత్తా చంద్రబాబుకు ఉంది. జూనియర్ తెరపైకి వస్తారని తెలుగు తమ్ముళ్లు ఆశ పెట్టుకున్నారు.