Pawan Kalyan- Chandrababu: సంక్షోభాలను సన్మార్గాలుగా మలుచుకొని సక్సెస్ అయ్యారు చంద్రబాబు. అటు ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం పాలించిన సీఎంగా, ఇటు అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా చాన్స్ దక్కించుకున్నారు. అయితే చంద్రబాబు రాజకీయ పరిణామ క్రమం చూసుకుంటే ఆయన సంక్షోభాలను అధిగమించే ఈ స్థాయికి చేరుకున్నారు. తాజాగా నిన్నటి పవన్ ఎపిసోడ్ లో క్షణాల్లో పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి ఏపీలో చంద్రబాబు, టీడీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అధికార వైసీపీని ఎదుర్కొలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆయనకు గట్టి తోడు అవసరం. గత కొన్నేళ్లుగా ఆయన పవన్ తో చెలిమికి ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ సాధ్యపడలేదు. కానీ పవన్ వైసీపీపై వీరవిహారం చేసిన తరుణంలో ఇదే మంచి సమయమని భావించి పవన్ వద్దకు చేరారు. అటు జనసేన, పవన్ అభిమానుల వద్ద పాజిటివ్ ఓపీనియన్ నెలకొనేలా స్పాంటెనిస్ గా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. పవన్ ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసే వచ్చానని… జగన్ నిర్ణయాలతో ప్రజలే కాకుండా విపక్షాలు ఇబ్బందిపడుతున్నాయని గుర్తుచేస్తూ… పెద్దన్న పాత్ర పోషించేందుకు ముందుకొచ్చారు.

వాస్తవానికి చంద్రబాబు కంటే ముందుగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ ను కలిశారు. కానీ అంతలా హైప్ కాలేదు. అటు జనసేన కూడా లైట్ తీసుకుంది. వైసీపీతో బీజేపీ పెద్దలు సన్నిహితంగా ఉండడం, జగన్ విషయంలో మెతక వైఖరి అవలంభిస్తుండడంతో సోము వీర్రాజు స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపినా అంత ప్రాధాన్యత దక్కలేదు. కానీ చంద్రబాబు నేరుగా పవన్ బసచేసిన నోవాటల్ హోటల్ కి వెళ్లి కలుసుకోవడం మాత్రం పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి విశాఖ క్యాపిటల్ రాజధానిని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రజల్లోకి వెళ్లేలా ప్రజాగర్జనకు ప్రభుత్వ పెద్దలు పురమాయించారు. అయితే ముందే అప్రమత్తమైన చంద్రబాబు సేవ్ విశాఖ పేరిట టీడీపీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేసినా ప్రజల్లో వెళ్లలేదు. అదే సమయంలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఈ మొత్తం పరిణామంలో టీడీపీ అండ్ చంద్రబాబు అండ్ కో వెనుకబడిపోయింది.
అయితే విశాఖను వీడి వెళ్లిన పవన్ విజయవాడలో గర్జించారు. చెప్పు చూపించి మరీ నా కొడకల్లారా అంటూ హెచ్చరికలు జారీచేశారు. పవన్ భావోద్వేగంతో ఉన్నారని తెలుసుకొని అప్పటికప్పుడు చంద్రబాబు స్ట్రాటజీ మార్చారు. పవన్ తో భేటీకి సడన్ టూర్ నిర్ణయించారు. నేరుగా నోవాటల్ కి వెళ్లి పవన్ ను పరామర్శించారు. అయితే ఈ అనూహ్య పరిణామం అటు జనసేనకు, ఇటు టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తంకాగా.. అధికార పార్టీలో మాత్రం కలవరం ప్రారంభమైంది. చంద్రబాబు షడన్ ఎంట్రీతో వైసీపీ విశాఖ గర్జనలు, పవన్ హెచ్చరికలు పక్కకు వెళ్లిపోయాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా శరవేగంగా పరిణామాలు మారిపోయాయి. ఇప్పటికే టీడీపీ,జనసేన మధ్య మంచి వాతావరణమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ దురాగతాలు, ఆ ప్రభుత్వ వైఖరిపై చంద్రబాబు, పవన్ లు చర్చించుకున్నారు. నాదేండ్ల మనోహర్, నాగబాబు సైతం చర్చల్లో పాల్గొన్నారు. అటు తరువాత ఇరువురు అధినేతలు ఏకంగా చర్చించుకున్నారు. తరువాత మీడియా ముందుకు సంయుక్తంగా వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట అన్ని పార్టీలు కలిసిపోరాడుదామని చంద్రబాబు ప్రతిపాదించగా.. అందుకు పవన్ సమ్మతించడం చకచకా జరిగిపోయాయి.

అయితే ఈ మొత్తం ఎపిసోడల్ లో చంద్రబాబు తన చతురతను ప్రదర్శించారు. ఇప్పటికే ఆయన జనసేనతో పొత్తు దిశగా ఎన్నిరకాల ప్రచారం కల్పించాలో అన్నివిధాలుగా చేసేశారు. ఇప్పుడు ముందున్న టార్గెట్ బీజేపీ. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీపై అసంతృప్తే కనిపిస్తోంది. కానీ చంద్రబాబులో మాత్రం ఎలాగైనా బీజేపీని కలుపుకొని వెళ్లాలనే భావనే వ్యక్తమవుతోంది. గత ఎన్నికల నాటి పరిణామాలు ఆయన కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రస్తుతం జనసేన, టీడీపీ కలిస్తే జనామోదం లభించినా.. వ్యవస్థల అనుగ్రహం ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఇప్పటికీ చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే బీజేపీ గురించి వెయిట్ చెద్దామన్న సంకేతాలిచ్చారు. అయితే మీడియా సమావేశంలో పనిలోపనిగా తన లీడర్ షిప్ గురించి చంద్రబాబు చెబుతుంటే పవన్ కాస్తా ఇబ్బందిపడినట్టు కనిపించారు. కానీ ఏరికోరి తనకు సంఘీభావం తెలపడానికి వచ్చిన సీనియర్ లీడరు కావడంతో కాసింత ఓపిగ్గానే చంద్రబాబు చెబుతున్న మాటలను విన్నారు. మొత్తానికైతే నిన్నటివరకూ చెయ్యి కింద ఉన్నా.. పవన్ ఎపిసోడ్ తో మాత్రం చంద్రబాబు పుంజుకున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.