Chandrababu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇంకా సీట్ల సర్దుబాటు విషయం తేలలేదు. మరోవైపు జగన్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతున్నారు. దాదాపు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను తేల్చే పనిలో ఉన్నారు. కానీ తెలుగుదేశం, జనసేనల మధ్య సీట్ల ప్రకటన రగడ జరుగుతోంది. చంద్రబాబు ఏకపక్షంగా టిడిపి అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు చేశారు కనుక తాను కూడా రెండు నియోజకవర్గాలను పవన్ ప్రకటించారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేకుండా పోతుంది. ఆయన భయపడ్డారని ప్రచారం జరుగుతోంది.
రాజానగరం, రాజోలు నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీకి దిగుతారని పవన్ ప్రకటించారు.సీఎం పదవి షేరింగ్ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలపై సైతం పవన్ స్పందించారు. అయినా సరే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు కొనసాగుతుందని పవన్ తేల్చేశారు. అయినా సరే పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కానీ.. లోకేష్ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఒక్క బోండా ఉమ పవన్ ప్రకటించినవి జనసేనకు ఇవ్వాల్సిన సీట్లేనని సమర్థించుకున్నారు. అటు తరువాత దీనిపై ఎవరూ నోరు మెదపడం లేదు. అయితే పవన్ పునరాలోచనలో పడ్డారని.. బిజెపి డైరెక్షన్లో పని చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో చంద్రబాబు ఎలా ముందుకెళ్తారు అన్నది అందరిలోనూ ఒక ప్రశ్న.
అయితే ఇప్పటికిప్పుడు పవన్ బయటపడే మార్గాలు లేవు. ఒకవేళ పవన్ బయటకు వెళ్ళినా చంద్రబాబుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారని ప్రచారం ఉంది. పవన్ వెళ్ళిపోయిన మరుక్షణం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వెంట నడిచే అవకాశం ఉంది. మరోవైపు వామపక్షాలు సైతం సిద్ధంగా ఉన్నాయి. గత కొంతకాలంగా టిడిపితో కలిసి వెళ్లేందుకు వామపక్షాలు సంసిద్ధత ప్రకటించాయి. బిజెపి నుంచి తెగతెంపులు చేసుకుంటే అవి నిరభ్యంతరంగా టిడిపితో కలిసి నడవనున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నందున చంద్రబాబు వస్తానంటే తప్పకుండా ఆహ్వానిస్తాయి. చంద్రబాబుతో కలిసి నడిచేందుకు ప్రయత్నిస్తాయి.
వీలైనంతవరకూ సీట్లు పెంచుకునేందుకు పవన్ ఒత్తిడి చేస్తున్నారని.. ఆయన తెలుగుదేశం పార్టీతోనే నడుస్తారని తెలుస్తోంది. ఒకవేళ బిజెపి రాకున్నా.. తెలుగుదేశం పార్టీతో ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయని.. స్థానిక సంస్థల ఎన్నికల వరకు పొత్తు ఉంటుందని చెప్పడం ద్వారా.. పవన్ గట్టి సంకేతాలే పంపారు. ఒకవేళ కూటమి వైపు బిజెపి రాకుంటే.. పవన్ సైతం ఇండియా కూటమి వైపు మనసు మార్చే అవకాశం ఉంది. ఆ మేరకు చంద్రబాబు సైతం పవన్ ను ఒప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలా చూసుకున్నా చంద్రబాబుకు మిత్రులు రెడీగా ఉండడంతో.. ఆయన భయపడే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.