Chandrababu: తెలుగుదేశానికి పట్టున్న ప్రాంతాల్లో కృష్ణా జిల్లా ప్రధానమైనది.కానీ గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతింది. కేవలం రెండు అసెంబ్లీ సీట్లు, విజయవాడ ఎంపీ స్థానానికి పరిమితమైంది. వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో సత్తా చాటాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అయితే నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కేవలం వారు పత్రికా ప్రకటనలకు, టీవీ చర్చలకే పరిమితమై పోతున్నారన్న టాక్ నడుస్తోంది.
కొద్ది రోజుల్లో లోకేష్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టనుంది. తొలుత రూపొందించిన షెడ్యూల్ ను కుదించినట్లు తెలుస్తోంది. విజయవాడ నగరంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఇందులో ఒక్క గన్నవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరనున్నారు.
అయితే రాష్ట్రస్థాయి లో కృష్ణా జిల్లా నేతలు యాక్టివ్ పాత్ర పోషిస్తున్న.. స్థానికంగా పార్టీ బలోపేతం విషయంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నట్టు చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కృష్ణాజిల్లా నేతలకు గట్టి క్లాస్ పీకినట్లు సమాచారం. మరోవైపు కేశినేని చిన్ని పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. సహజంగా ఇది కేశినేని నానికి మింగుడు పడటం లేదు. విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర బాధ్యతను చిన్ని చూస్తున్నారు.
కృష్ణా జిల్లాతో పాటు విజయవాడలో పార్టీకి కీలక నేతలు ఉన్నా ఆ స్థాయిలో మైలేజ్ రావడం లేదు. లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ను కుదించడం వెనుక నాయకుల నిర్లక్ష్య వైఖరి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రతి సీటు చంద్రబాబు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు విజయవాడలో కీలక నియోజకవర్గాల్లో వైసీపీ టికెట్లను కన్ఫర్మ్ చేస్తోంది. ఈ తరుణంలో లోకేష్ పాదయాత్ర సాక్షిగా కొన్ని కీలక నియోజకవర్గం టిడిపి సైతం టిక్కెట్లు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొంతమంది నేతలను పక్కన పెట్టనున్నట్లు సమాచారం. లోకేష్ పాదయాత్ర వేదికగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.